AP: ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం
విశాఖపట్నం (CLiC2NEWS): అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు (ఆది, సోమవారం) కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే నవంబర్ మొదటి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీని అల్పపీడనం ప్రభావంతో తూర్పు గాలులు తక్కువ ఎత్తులో రాష్ట్రం వైపు బలంగా వీస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా నవంబరు 2వ వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. కాగా క్రమంగా ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందా లేక దిశ మార్చుకుంటుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని అధికారులు తెలిపారు.