తెలంగాణ వడ్లు కొంటరా? కొనరా..?: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): “మా ప్రశ్న ఒక్కటే… తెలంగాణ వడ్లు కొంటారా.. కొనరా?“ అని ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర సర్కార్‌ను ప్రశన్నించారు. రైతులు కొత్త కోరికలు కోరడం లేదని.. పండిన పంట కొంటారా.. కొనరా..? అనే అడుగుతున్నారన్నారు.
కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతోందని కెసిఆర్ ధ్వజమెత్తారు. ఒకటే మాట.. ఏం జరుగుతోంది. ఏంది గడబిడి ఇది. లొల్లి ఏంది అసలు. ఒకటే ఒక మాట. సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణలో పండించే వడ్లు కొంటరా..? కొనరా..? అది చెప్పమంటే.. మేం మరాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ గురువారం చేపట్టిన రైతు మహాధర్నాలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించారు.
మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏడాది కాలం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో వేల లక్షల మంది రైతులు వరుస నిరాహార ధీక్షలు చేస్తున్నారు. పంటలు పండించే శక్తి లేక కాదు. కేంద్రం తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తన విధానాలు మార్చుకోకుండా అడ్డగోలుగా మాట్లాడుతోంది. దేశంలో 12 కోట్ల మంది రైతుల ఉన్నారు. 40 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అద్భుతమైన నదులున్నాయి. బంగారు పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. దాదాపు సగం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు అని సిఎం తెలిపారు.
కేంద్రం మీద యుద్ధం ప్రారంభమైంది. ఉత్తర భారత రైతాంగం కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తోంది. రైతుల జీవితాలపై చెలగాటమాడుతోంది. కార్లతో తొక్కి చంపుతోంది. ఇవాళ తెలంగాణ రైతులపై బిజెపి నేతలు కన్నేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతులను బతకనిస్తారా? బతకనివ్వారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
దిష్టి తీసి బిజెపి కార్యాలయంపై కుమ్మరిస్తాం..
మా ఓపికకు ఓ హద్దు ఉంది. ప్రధానిని చేతులు జోడించి ఒకటే మాట అడుతున్నా.. వడ్లు కొంటరా..? కొనరా..? దీనిపై ఆయనకు నిన్న లేఖ రాశా.. దేశంలోని రైతు సమస్యలపై టిఆర్ఎస్ నాయకత్వం తీసుకుంటుంది. ధాన్యం కొంటామని ఇప్పటి వరకు కేంద్రం హామీ ఇవ్వలేదు. యాసంగిలో ధాన్యం వద్దని చెబితే వేయాలని బిజెపి అంటోంది. కేంద్రం ధాన్యం తీసుకోకపోతే దిష్టితీసి బిజెపి కార్యాలయంపై కుమ్మరిస్తాం. దేశ రైతుల పరిష్కారం కోసం నేతృత్వం వహిస్తాం. రాష్ట్ర సాధనలో పదవులను తృణప్రాయంగా వదులుకున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మత విద్వేషాలు రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారు. సర్జికల్ స్టైక్స్ వంటి నాటకాలు బయటికొచ్చాయి. ప్రజలకు తెలిశాయి.
దిక్కు మాలిన కేంద్ర ప్రభుత్వం విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారు. వడ్లు వేయాలి.. మెడలు వంచి కొనిపిస్తాం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ దేశాన్ని పాలించే బీజేపీ అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్, వాట్సాప్‌లలో వితండవాదాలు సృష్టిస్తున్నారు అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.