ఓఆర్ఆర్ ప‌రిధిలో కొత్త‌గా 2 ల‌క్ష‌ల ఇళ్ల‌కు తాగునీటి స‌ర‌ఫ‌రా

మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓఆర్ఆర్ ఫేజ్ - 2 ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌

మేడ్చ‌ల్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌, పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల ప‌రిధిలో వివిధ అభివృద్ధి ప‌నుల‌తో పాటు ఓఆర్ఆర్ ఫేజ్ – 2 ప‌నుల‌కు బుధ‌వారం  శంకుస్థాప‌న చేశారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిధిలోని మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, గ్రామ పంచాయ‌తీలు, కాల‌నీలు, గేటెడ్ క‌మ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1,200 కోట్ల‌తో జ‌ల‌మండ‌లి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ఫేజ్‌-2 ప‌నుల‌ను చేప‌ట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు రూ.240 కోట్ల‌కు పైగా నిధుల‌తో జ‌ల‌మండ‌లి తాగునీటి స‌దుపాయాలు క‌ల్పించ‌నుంది.

ఈ సంద‌ర్భంగా మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు మాట్లాడుతూ.. దేశంలోని అన్ని మ‌హాన‌గ‌రాల్లో తాగునీటి కొర‌త తీవ్రంగా ఉంద‌ని, రైళ్ల‌లో నీటిని త‌ర‌లించాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని పేర్కొన్నారు. మ‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో ఇలాంటి ప‌రిస్థితులు రావొద్ద‌ని తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచే మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించి తాగునీటి స‌మ‌స్య లేకుండా చేశార‌న్నారు. మొత్తం రాష్ట్ర‌మంతా ప్ర‌తీ ఇంటికి నీటిని అందించేందుకు మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని చేప‌ట్టిన‌ట్లు తెలిపారు.

2014 – 18 మ‌ధ్యకాలంలో జీహెచ్ఎంసీ ప‌రిధిలోని శివారు మున్సిపాలిటీల్లో తాగునీటి స‌మ‌స్య‌ను పూర్తిగా ప‌రిష్క‌రించేందుకు సుమారు రూ.2,000 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రం ఔట‌ర్ రింగ్ రోడ్డు వ‌ర‌కు విస్త‌రించినందున తమ ప్ర‌భుత్వం ఓఆర్ఆర్ ప‌రిధిని మొత్తం హైద‌రాబాద్ న‌గ‌రంగానే ప‌రిగ‌ణిస్తోంద‌ని చెప్పారు. ఈ ప్రాంతంలోని మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు, గ్రామ పంచాయ‌తీల్లోనూ తాగునీటి స‌మ‌స్య లేకుండా ఓఆర్ఆర్ ఫేజ్ – 1లో సుమారు రూ.700 కోట్ల‌కు పైగా నిధుల‌తో తాగునీటి స‌దుపాయాన్ని క‌ల్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఇప్పుడు ఓఆర్ఆర్ ప‌రిధిలోని మ‌రో 2 ల‌క్ష‌లకు పైగా ఇళ్ల‌కు నీటిని అందించేందుకు రూ.1,200 కోట్ల‌తో ఓఆర్ఆర్ ఫేజ్ – 2 ప‌నుల‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు.

ఓఆర్ఆర్ ఫేజ్ -2 ప‌నుల్లో భాగంగా మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు రూ.240 కోట్ల‌కు పైగా నిధుల‌తో ప‌నులు జ‌రిపిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి ప్ర‌జ‌ల‌కు తాగునీటిని అందిస్తామ‌ని చెప్పారు. మేడ్చ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోనే కొత్త‌గా 50 వేల ఇళ్ల‌కు ఒక్క‌ రూపాయికే న‌ల్లా క‌నెక్ష‌న్‌లు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఏప్రిల్‌, జులై, డిసెంబ‌ర్ నెల‌ల్లో మూడు విడ‌త‌లుగా కొత్త క‌నెక్ష‌న్లు ఇచ్చి తాగునీటిని అందిస్తామ‌ని పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్మిక శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్‌, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌లిపెద్ది శ‌ర‌త్‌చంద్రారెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌, టెక్నికల్ డైరెక్ట‌ర్ ర‌వికుమార్‌, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ మేయ‌ర్ మేక‌ల కావ్య, పీర్జాదిగూడ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి, బోడుప్ప‌ల్ మేయ‌ర్ బుచ్చిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.