ఇబ్రహీంపట్నంలో ఓఆర్ఆర్ ఫేజ్- 2 పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ (CLiC2NEWS): ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని జీహెచ్ఎంసీ బయట గల మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1,200 కోట్లతో ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ఫేజ్ -2 పనులకు జలమండలి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చేపడుతున్న ఓఆర్ఆర్ ఫేజ్ – 2 పనులకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం శంకుస్థాపన చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో సుమారు రూ.134 కోట్లతో తాగునీటి కోసం ఇన్లెట్, అవుట్ లెట్, పైప్‌లైన్ వ్యవస్థ, సర్వీస్ రిజర్వాయర్ల నిర్మాణం, తదితర పనులు జరగనున్నాయి. ఈ పనుల ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల, తుర్కయంజాల, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీల్లో పూర్తిస్థాయిలో తాగునీటి వ్యవస్థ ఏర్పడనుంది. నియోజకవర్గంలో కొత్తగా 7 రిజర్వాయర్ల నిర్మాణం జరగనుంది. వీటి మొత్తం సామర్థ్యం 8 మిలియన్ లీటర్లుగా ఉంటుంది. మొత్తం 394 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్ నిర్మాణం జరగనుంది. ఈ పనుల ద్వారా ఈ మూడు మున్సిపాలిటీల్లో లక్ష మందికి పైగా ప్రజలకు, 20 వేలకు పైగా గృహాలకు లబ్ధి చేకూరుతుంది.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.
ప్రాజెక్టు పూర్తైన తర్వాత కలగనున్న ప్రయోజనాలు
ప్రస్తుతం నీరు అందుతున్న ప్రజలకు నీటి సరఫరా మరింత మెరుగవుతుంది. ఇప్పటివరకు నీటి సరఫరా వ్యవస్థ లేని ప్రాంతాలకు కూడా తాగునీరు అందుతుంది.
ప్రస్తుతం 3 రోజులకు ఒకసారి, అంతకంటే ఎక్కువ రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతుంది.
నీటి సరఫరాకు తగు ప్రెషర్ ఉండటం వల్ల లోప్రెషర్ సమస్య పరిష్కారమవుతుంది.