కామారెడ్డిలో విషాదం.. విద్యుత్ షాక్ ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు దుర్మ‌ర‌ణం

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక డీడీ వ‌ర్క‌ర్స్ కాల‌నీలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెంద‌ని న‌లుగురు మృతిచెందారు. మృతుల్లో భార్య‌భ‌ర్త‌ల‌తో పాటు వారి ఇద్దరి పిల్లలు ఉన్నారు.

గ‌త 4 రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోన్న వాన‌ల‌తో ఇల్లు మొత్తం తేమ‌తో నిండిపోయింది. దీంతో ఇల్లు మొత్తం క‌రెంట్ స‌ర‌ఫ‌రా అయింది. ఇది గుర్తించ‌ని ఇంట్లోని వారు వ‌స్తువుల‌ను తాక‌డంతో ఇంటిల్లిపాది అంద‌రికీ క‌రెంట్ షాక్ కొట్టింది. దీంతో భార్య, భ‌ర్త ఇద్ద‌రు పిల్ల‌లు అక్క‌డిక్క‌డే మృతిచెందారు.

స్థానికులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. జిల్లా కేంద్రంలోని బీడీ వ‌ర్క‌ర్స్ కాల‌నీకి చెందిన హైమ‌ద్ (35), ఫ‌ర్వీన్ (30) అద్నాన్ (4), మ‌హిమ్ (6) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఇంట్లో మొద‌ట పిల్ల‌ల‌కు విద్యుత్ షాక్ త‌గిలింది. వారిని ర‌క్షించే క్ర‌మంలో త‌ల్లిదండ్రులూ క‌రెంట్ షాక్‌కు గుర‌య్యారు. మృత‌దేహాల‌ను కామారెడ్డి ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.