టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూత
హైదరాబాద్ (CLiC2NEWS): టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చలపతిరావు ఆదివారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. ఆయనకు కుమారుడు రవిబాబు, కుమార్తెలు మాలినిదేవి, శ్రీదేవి ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
చలపతిరావు 1944 మే 8న కృష్ణా జిల్లా బల్లిపర్రులో జన్మించారు. 1996లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన `గూఢచారి 116` సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. సహాయనటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. నిర్మాతగాను ఆయన గుర్తింపు పొందారు.
బుధవారం అంత్యక్రియలు..
చలపతిరావు కుమార్తె అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు.