ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలు ధ్వంసం..
Iran Israel war: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బాలిస్టిక్ క్షిపణి స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) వివరించింది. పలు బాలిస్టిక్ క్షిపణులను నిల్వ చేసిన ప్రాంతాలను , ప్రయోగ స్థావరానలు ఈ దాడుల్లో నాశనం చేసినట్లు పేర్కొంది. ఈ క్షిపణులన్ని ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. అందుకే వాటిని నాశనం చేసినట్లు తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ కు చెందిన ఓ డ్రోన్‌ను ఖోరామాబాద్ ప్రాంతంలో ఇరాన్ కూల్చివేసింది. అది హెర్మ్స్ రకం డ్రోన్ అని ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనిని ఐడిఎఫ్ ధ్రువీకరించింది.
ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పోరు నేపథ్యంలో అమెరికా నేరుగా యుద్ధరంగంలోకి దిగింది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇరాన్ అణుశక్తి కేంద్రాలే లక్ష్యంగా శక్తిమంతమైన బాంబర్లు, క్షిపణులతో విరుచుకుపడింది. 3 అణు కేంద్రాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. అమెరికా దాడులను ఇరాన్ కొత్త సైనికాధ్యక్షుడు మేజర్ జనరల్ అమిర్ హతామీ తీవ్రంగా ఖండించారు. తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా నేరాలకు పాల్పడిన ప్రతిసారీ వారిక గట్టి ప్రతిస్పందన లభించిందని అన్నారు. ఈ సారి కూడా అటువంటి ధీటైన జవాబు ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.