వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్నతండ్రిని హత్య చేసిన కుమార్తె
ఘట్కేసర్ (CLiC2NEWS): ప్రేమకు అడ్డుచెబుతోందని ఇటీవల ఓ కుమార్తె కన్నతల్లిని హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వివాహేత సంబంధానికి అడ్డుతగులుతున్నాడని ఓ కుమార్తె తన కన్న తండ్రిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వడ్లూరి లింగంకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మనీషాకు వివాహమైంది. ఆమె భర్త స్నేహితుడితో వివాహేతర బంధం ఏర్పడింది. దీంతో భర్త వదిలివేశాడు. ఆమె ప్రియుడితో కలిసి ఉంటుంది. ఈ వ్యవహారం తెలిసిన తండ్రి తిట్టాడనే కోపంతో తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. మనీషా తల్లి (శారద) కూడా భర్త తనను అనుమానిస్తున్నాడని కుమార్తెతో చెప్పింది. తల్లీ, కుమార్తెలు కల్లులో నిద్ర మాత్రలు కలిపి లింగంకు ఇచ్చారు. అనంతరం కుమార్తె, అమె ప్రియుడు లింగం ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చెరువలో పడేశారు. ఈ నెల 7వ తేదీన ఎదులాబాద్ చెరువులో మృతదేహం లభ్యం కాగా పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.