ఆ విద్యార్థులకు ఐఐటి, నీట్ ఉచిత శిక్షణ.. మంత్రి నారాయణ
అమరావతి (CLiC2NEWS): ఐఐటి , నీట్లో అతి తక్కువ మార్కులతో సీట్లు సాధించలేకపోయిన విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల్లో ఉచిత శిక్షణ ఇవ్వాలని మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామితో నారాయణ చర్చించారు.
రాష్ట్రంలో ఉన్న గిరిజన, ఎస్సి సంక్షేమ వసతి గృహాలు , గురుకులాల్లో చదివే విద్యార్థులకు నారాయణ సంస్థల్లో ఐఐటి, నీట్ లాంగ్ టర్మ్ ఉచిత కోచింగ్ ఇవ్వాలని మంత్రి నిర్ణయించారు. ఈ ఏడాది 80 మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. శిక్షణా సమయంలో మెటీరియల్ , ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పించనున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పేద విద్యార్థుల కోసం మంత్రి నారాయణ తీసుకున్న నిర్ణయానికి డోలా బాల వీరాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు.