ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
అమరావతి: వైఎస్సార్ ఆసరా పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ బేటీలో సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా వైఎస్సార్ ఆసరా పథకానికి ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం ద్వారా 9 లక్షల 33 వేల డ్వాక్రా గ్రూపులకు లబ్ధి చేకూరనుంది. మొదటి ఏడాది రూ.6,792 కోట్ల లబ్ధి లభించనుంది. మొత్తంగా నాలుగేళ్లలో 27 వేల 168 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. డ్వాక్రా గ్రూపులను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కిట్ల పంపిణీ చేయనుంది. 42 లక్షల 32 వేల మందికి వచ్చే నెల 5న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే గర్భిణీలు, బాలింతలు, పిల్లల కోసం వచ్చే నెల 1న వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి శ్రీకారం చుట్టనుంది. వీటితో పాటు డిసెంబర్ ఒకటి నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 9260 వాహనాల ద్వారా ఇంటివద్దనే తూకం వేసి బియ్యం పంపిణీ చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువకులకు వాహనాలు సబ్సిడీపై అందజేయనుంది. అలాగే 583 కోట్లతో బియ్యం కార్డుదారులకు వైఎస్సార్ భీమా పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పారిశ్రామిక విధానానికి కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఏపీ బల్క్ డ్రగ్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏపీ ఆక్వా కల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ కేబినెట్ బేటీలో మంత్రులతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. జగనన్న విద్యా కానుక ద్వారా యూనిఫామ్‌లు, షూ, బెల్టు తదితర వస్తువులను 43 లక్షలకు పైగా విద్యార్థులకు అందజేస్తామన్నారు. ఇంటింటికి నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ఎలక్ట్రానికి పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైట్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
కేబినెట్ నిర్ణయాలు
- వైఎస్సార్ బీమా కింద సామాజిక భద్రతా పథకం
- ఈ పథకం 18-50 ఏళ్ల మధ్య వారికి వర్తిస్తుంది. సహజ మరణం పొందితే రూ.2లక్షల పరిహారం అందుతుంది.
- శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు, 18–50 ఏళ్ల మధ్య వర్తింపు
- శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలు, 51–70 ఏళ్ల మధ్య వర్తింపు
- రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న సూమారు కోటి 50లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది.
- ఈ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.583.5 కోట్లు ఖర్చు చేయనుంది.
- చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్ పోస్టులు, 14 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
- వైఎస్సార్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్ పోస్టులు, 8 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం
- విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో దాదాపు రూ.510 కోట్ల వ్యయంతో అదనంగా 2 యూనిట్లు ఏర్పాటుకు ఆమోదం
- వైఎస్సార్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.పులివెందుల సబ్‌డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్‌డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం.
- రాయచోటిలో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకూ ఆమోదం.
- వై.ఎస్సార్ జిల్లాకు కొత్తగా 76 హోంగార్డు పోస్టులు మంజూరుకు మంత్రిమండలి ఆమోదం
నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్ ఆమోదం - రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, 2000 ఎకరాల్లో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్క్
బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో రూ.46,400 కోట్లు అమ్మకాలు జరుగుతాయని అంచనా.
దాదాపు రూ.6940 కోట్లు పెట్టుబడులు వస్తాయని అంచనా.