అగ్నిప్రమాదంలో 20 పూరిళ్లు దగ్ధం
పూసపాటిరేగ: విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలోని చింతపల్లిలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు లక్షల్లో నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. చుక్క రాములు, కొర్లయ్య, పోలమ్మ, కారి మసీన, కొమర నరిసమ్మ, బర్రి అమ్మోరు ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కారి రాము ఇంట్లో ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు ఎగసిపడ్డాయి. తర్వాత మెల్లగా ఆ మంటలు పక్కఇళ్లకు వ్యాపించాయి. పైన పేర్కొన్న బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. విజయనగరం నుండి ఫైరింజన్ వచ్చి మంటలను అదుపు చేసింది. తహశీల్దార్ విజయభాస్కర్, ఆర్ఐ సత్తిబాబు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నారు.