గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం
భోపాల్ (CLiC2NEWS): గుజరాత్ సిఎంగా భూపేంద్ర పటేల్ (59) సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత ప్రమాణ స్వీకారం చేయించారు. గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను అదృష్టం వరించింది. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జనతాపార్టీ శాసనసభాపక్షం ఈ మేరకు భూపేంద్ర పటేల్‌ను గుజరాత్ సిఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులున్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. బీజేపీ హైకమాండ్ పటేల్ సామాజిక వర్గంవైపు మొగ్గుచూపింది. ఇవాళ గాంధీనగర్‌లో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఆనందీబెన్ గతంలో ప్రాతినిధ్యం వహించిన ఘట్లోడియా స్థానం నుంచే భూపేంద్ర 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు.