నిరుద్యోగ యువతకు శుభవార్త..
హైదరాబాద్ (CLiC2NEWS): ఉద్యోగాల కోసం సన్నద్దమవుతున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తనందించింది. కొలువుల కోసం ప్రిపేరవుతున్న వారికి ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. బిసి స్టడీ సర్కిళ్లలో టిజిపిఎస్‌సి ఎస్ ఎస్ సి, ఆర్ ఆర్‌బి, బ్యాంకింగ్, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. డిగ్రీలో మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి నెలకు రూ.వెయ్యి స్టైఫెండ్ ఇవ్వనున్నారు.
ఉచిత కోచింగ్ కోసం అభ్యర్థులుwww//tgbcstudycircle.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో ఆగస్టు 11వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి 5 నెలల పాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇటీవల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించారు. విద్యుత్, విద్య, ఆర్‌టిసి విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.
దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బిసి స్టడీ సర్కిళ్లలో గ్రూప్స్, ఆర్ఆర్‌బి, ఎస్ ఎస్‌సి, బ్యాంకింగ్ పోటీపరీక్షలకు ఫౌండేషన్ కోర్సు ఉచిత కోచింగ్ ప్రోగ్రాంను ఆగస్టు 25 నుండి ప్రారంభించనుంది. అభ్యర్థుల తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల వారైతే రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారైతే రూ.2లక్షల లోపు వార్షికాదాయం కలిగి ఉండాలి. డిగ్రీ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక జరుగుతుంది. ఎంపిక చేసిన అభ్యర్థలు జాబితాను ఆగస్టు 14వ తేదీన ప్రకటిస్తారు. ధ్రువ పత్రాల పరిశీలన ఆగస్టు 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరుగుతుంది.