ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి నారాయణ
అనంతపురం (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతపురంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామన్నారు. సిఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ది జరిగితేనే యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది గానీ.. చెత్తను తొలగించలేదని ఈ సందర్బంగా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెత్తపై ఉన్న పన్నును తొలిగించినట్లు చెప్పారు.