దళపతి నుంచి దళనాయకుడు వరకు..

తమిళనాడును ఊపేసిన విజయ్ రాజకీయ తుఫాన్!
తమిళనాడు రాజకీయ చరిత్రలో మరో భారీ మలుపు తిరిగింది.
సినిమా తెరపై కోట్లాది అభిమానుల గుండెల్లో `దళపతి`గా నిలిచిన జోసెఫ్‌ విజయ్ ఇప్పుడు ప్రజాస్వామ్య వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త రాజకీయ యుగానికి శ్రీకారం చుట్టారు.

ఇది కేవలం ఓ నటుడి విజయగాథ కాదు…
`పాత రాజకీయాలకు విసిగిపోయిన యువత తిరుగుబాటు` కూడా.
`సినిమా హీరో రాజకీయాలు చేస్తాడా?` …
అంటూ మొదలైన ఎద్దేవా విజయ్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రోజు నుంచి విమర్శల తుఫాన్ మొదలైంది.
`సినిమా డైలాగులతో పాలన సాగదు…`
`ఫ్యాన్స్ ఉంటే ఓట్లు రావు…`
`రాజకీయాలు షూటింగ్ స్పాట్ కాదు…`
అంటూ ప్రత్యర్థులు ఎగతాళి చేశారు.

సోషల్ మీడియాలో మీమ్స్, రాజకీయ వేదికలపై విమర్శలు, టీవీ డిబేట్లలో ఈసడింపులు ఎదుర్కొన్నారు విజయ్.
కానీ ఆయన ఒక్క మాట కూడా వెనక్కి తగ్గలేదు.
సినిమా ఫంక్షన్లలో చెప్పే పంచ్ డైలాగ్‌ల స్థానంలో…
ప్రజల మధ్య కూర్చుని వారి బాధలు విన్నాడు.
నిరుద్యోగ యువతతో మాట్లాడాడు.
రైతుల కష్టాలు తెలుసుకున్నాడు.
చిన్న పట్టణాల్లో పర్యటిస్తూ “మనోడే” అనే భావన కలిగించాడు.
విజయ్ బలం యువత, సోషల్ మీడియా….
కోపంతో ఉన్న ఓటర్లు
తమిళనాడులో యువత పెద్దఎత్తున విజయ్ వైపు మొగ్గింది.దానికి కారణం ఆయన స్టార్ ఇమేజ్ మాత్రమే కాదు…

“సిస్టమ్ మారాలి” అన్న భావన.
పాత పార్టీల కుటుంబ రాజకీయాలు…
అవినీతి ఆరోపణలు…
నిరుద్యోగం…
ధరల భారం…
ఈ అసంతృప్తిని విజయ్ అద్భుతంగా క్యాష్ చేసుకున్నారు.
ఆయన సభలు రాజకీయ మీటింగ్స్ కంటే “యువజన ఉద్యమాలు”లా కనిపించాయి.
సెల్ఫీల కోసం వచ్చిన జనాలు… చివరకు ఓట్లుగా మారిపోయారు.

ఆ తొక్కిసలాట…

విజయ్‌ను లోపల నుంచి కదిలించిన సంఘటన
విజయ్ రాజకీయ యాత్రలో అత్యంత బాధాకర ఘట్టం ఆయన సభలో జరిగిన తొక్కిసలాట.
వేలాదిగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన గందరగోళంలో పలువురు గాయపడటం… కొందరి ప్రాణాలు కోల్పోవడం ఆయనను తీవ్రంగా కలచివేసింది.
ఆ రోజు స్టేజ్ మీద కనిపించిన విజయ్ కళ్లలో స్టార్ గ్లామర్ లేదు…బాధతో నిండిన మనిషి మాత్రమే కనిపించాడు.
“నా కోసం ఎవరి ప్రాణం పోకూడదు…” అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
ఆ సంఘటన తర్వాత సభల నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అది విజయ్ రాజకీయ ప్రయాణంలో ఓ కీలక మలుపు.

అభిమానుల ప్రేమ ఎంత పెద్ద శక్తో…
అదే సమయంలో ఎంత పెద్ద బాధ్యతో ఆయనకు అర్థమైంది.
ఎన్నికల యుద్ధం… కానీ మెజార్టీ మాత్రం అంచునే ఎన్నికల్లో TVK సంచలనం సృష్టించింది.
డీఎంకే–ఏఐఏడీఎంకేలను దాటుకుని అతిపెద్ద పార్టీగా ఎదిగింది.
కానీ పూర్తి మెజార్టీ మాత్రం రాలేదు.
ఇక్కడే అసలు రాజకీయ సినిమా మొదలైంది.
మద్దతు కోసం చిన్న పార్టీలతో చర్చలు…
రాత్రివేళ రాజకీయ భేటీలు…
మద్దతు లేఖల కోసం ఆపసోపాలు…
ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారోనని ఉత్కంఠ…
ఈ రాజకీయ థ్రిల్లర్‌లో విజయ్ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి వచ్చింది.
“సినిమాలో ఒక్క డైలాగ్‌తో విలన్ పడిపోతాడు…
రాజకీయాల్లో ఒక్క సంఖ్య తక్కువైనా ప్రభుత్వం పడిపోతుంది” అనే నిజం ఇప్పుడు ఆయనకు ప్రత్యక్షంగా తెలుస్తోంది.
స్టాలిన్ తర్వాతి శకం… కానీ సవాళ్లు మరింత పెద్దవి
స్టాలిన్ పాలనపై వ్యతిరేకత విజయ్‌కు కలిసొచ్చింది.
కానీ అదే సమయంలో ఇప్పుడు ప్రజల అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి.

ఇప్పుడు విజయ్ ముందున్న అసలు విలన్లు

  • నిరుద్యోగం
  • పరిశ్రమల పోటీ
  • కేంద్రంతో సంబంధాలు
  • కూటమి ఒత్తిళ్లు
  • పార్టీ అంతర్గత అసంతృప్తి
  • సోషల్ మీడియా ట్రోలింగ్
  • అనుభవం లేని నాయకత్వం అన్న విమర్శలు

ఒక్క తప్పు నిర్ణయం తీసుకున్నా ప్రత్యర్థులు ఎదురుచూస్తున్నారు.

“అభిమానం”ను “పాలన”గా మార్చగలడా?
ఎంజీఆర్, జయలలితల తర్వాత మరోసారి తమిళనాడు ఓ సినీ నాయకుడికి అధికారం ఇచ్చింది.
కానీ ఈ తరం మరింత వేగంగా తీర్పు ఇస్తుంది.
సినిమా ఫ్లాప్ అయితే మరో సినిమా వస్తుంది…
కానీ పాలన ఫ్లాప్ అయితే ప్రజలు వెంటనే తీర్పు చెబుతారు.
విజయ్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి.
ఒకటి చరిత్ర సృష్టించడం…
మరొకటి మరో సినీ రాజకీయ ప్రయోగంగా మిగిలిపోవడం.
కానీ ప్రస్తుతం తమిళనాడు యువత మాత్రం ఒక్క మాట చెబుతోంది
“ఇది కేవలం ప్రభుత్వం కాదు…
మార్పు కోసం ఓ తరం వేసిన సంతకం!’

-ఎస్.వి.రమణా చార్య
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు
సెల్‌: 98498 87086

Also Read: Happy Mother’s Day: కాలం మారుతుంది…

Leave A Reply

Your email address will not be published.