మంజీరా బ్యారేజీకి ముప్పులేదు: జ‌ల‌మండ‌లి ఎండీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేద‌ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. శనివారం జ‌ల‌మండ‌లి ఉన్న‌తాధికారుల‌తో కలిసి మంజీరా బ్యారేజ్‌ ప‌రిశీలించిన ఆయ‌న బ్యారేజ్‌కు ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని తెలిపారు. వివిధ సోష‌ల్ మీడియాల్లో బ్యారేజ్ పిల్ల‌ర్ల‌కు ప‌గుళ్లు వ‌చ్చాయ‌న్న వార్త‌లు అవాస్త‌మ‌ని తెలిపారు. బారాజ్ దిగువ‌న ఆఫ్రాన్ కొంత‌మేర‌కు దెబ్బ‌తిన్న‌ద‌ని వెంట‌నే మ‌రమ్మ‌త్తుల‌కోసం ఏజెన్సీతో మాట్లాడి యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అలాగే రెండ‌వ‌గేటు లీకేజీను అరిక‌ట్ట‌డానికి మ‌ర‌మ్మ‌త్తు ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని స్వ‌ప్న ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ‌కు సూచించారు.
యేళ్లు గ‌డిచిన బారాజ్ గేట్లు..

మంజీరా బ్యారేజ్ 65 సంవ‌త్స‌రాల క్రితం నిర్మిత‌మైందని, అప్పుడు బిగించిన‌ గేట్లు ప్ర‌తీఏటా నిర్వ‌హ‌ణ‌ప‌నులు చేప‌డుతున్నా గేట్లు, రోప్‌లు, బేరింగ్‌లను మార్చాల‌ని అధికారులు అంచ‌నా వేశార‌ని అన్నారు. దానిక‌నుగుణంగా గ‌త ఏడాది మే నెలలో 3.52 కోట్ల‌తో ప్ర‌తిపాద‌న‌ల‌ను పూర్తిచేసి, టెండ‌ర్ ప్ర‌క్రియ పూర్తిచేసి ఏజెన్సీని నియ‌మించామ‌ని వివ‌రించారు. ఏజెన్సీ గేట్ల బిగింపు కాకుండా మిగ‌తా ప‌నుల‌ను పురోగ‌తిలో ఉన్న‌ట్టు.. ఆ త‌రువాతే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ శుక్ర‌వారం రోజున‌ స‌మ‌ర్పించింద‌ని చెప్పారు.

రిపేర్‌ల‌కు 45 రోజులు నీటి స‌ర‌ఫ‌రాలో ఆటంకం..

బ్యారేజీ పై గేట్లను మార్చ‌డానికి దాదాపు 45 రోజులు ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు, అలాగే జ‌లాశయంలోని మొత్తం నీటిని ఎండీఎల్‌ దిగువ‌కు వ‌ద‌లవ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు. అన్నిరోజులు హైద‌రాబాద్ న‌గ‌రానికి 40 ఎంజీడీల నీటి కొర‌త ఏర్ప‌డుతుంద‌ని వివ‌రించారు. న‌గ‌ర‌వాసుల‌కు తాగునీటి ఇబ్బంది రాకుండా ఉండేందుకే కొత్త‌గేట్ల అమ‌రిక వాయిదా వేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఎండీ పేర్కొన్నారు. 2019 ఫిబ్ర‌వ‌రి నుంచి అక్టోబ‌ర్ 2020 వ‌ర‌కు బారాజ్‌లో నీటిని వినియోగించలేద‌ని.. ఆ స‌మ‌యంలో ‌ గేట్ల రిపేర్ ప‌నులు చేప‌ట్టి ఉంటే నీటిసరఫరాలో అంతరాయం లేకుండా ఉండేద‌న్నారు.

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి రానున్న 20 సంవ‌త్స‌రాల్లో తెలంగాణ కోర్ అర్బ‌న్ ప‌రిధిలో మౌలిక స‌దూపాయాల‌ను క‌ల్ప‌న భాగంగా.. స‌మృద్ధిగా నీటి స‌ర‌ఫ‌రాకు సంక‌ల్పించారు. అందులో భాగంగానే జల‌మండ‌లికి గోదావ‌రి ఫేజ్ 2,3 రూ. 7360 కోట్లు మంజూరు చేశారు. అలాగే భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కోసం మంజీరా డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్టును ఆధునికీక‌ర‌ణ ప‌నుల‌కోసం రూ. 600 కోట్ల‌తో డీపీఆర్‌ను రూపొందించి ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించామ‌ని తెలిపారు. దానికి గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆధునికీక‌ర‌ణ ప‌నుల‌తోపాటు ఇప్పుడున్న మంజీరా ఫేజ్‌ 1,2 మంచినీరు సర‌ఫ‌రా పైపులైనుల‌తోపాటు మ‌రో కొత్త పైపులైనును నిర్మించాల‌ని సూచించారు. దాంతోపాటు వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం ఈ ప్రాజెక్టు ప‌నుల‌లో భాగంగా చేప‌ట్ట‌మ‌న్నార‌ని వివ‌రించారు.

Leave A Reply

Your email address will not be published.