మృత్యుబావి కేసులో సంజ‌య్‌కు ఉరిశిక్ష

వ‌రంగల్‌: తెలంగాణలో సంచ‌ల‌నం సృష్టించిన తొమ్మిది మంది హ‌త్య‌కేసులో నిందితుడిపై నేరం రుజువు కావ‌డంతో న్యాయ‌స్థానం కీల‌క తీర్పు ఇచ్చింది. ఈ  ఏడాది మే 20న వ‌రంగ‌ల్ న‌గ‌ర శివారులోని గెర్రెకుంట బావిలో 9 మందిని హ‌త్య చేసిన కేసులో విచార‌ణ పూర్త‌యింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు సంజ‌య్ కుమార్ యాద‌వ్‌(24)ను కోర్టు దోషిగా తేల్చింది. నిందితుడిపై అభియోగాల‌ను ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ నిరూపించారు. నిందితుడికి వ‌రంగ‌ల్ మొద‌టి అద‌న‌పు జిల్లా కోర్టు న్యాయ‌మూర్తి జ‌య‌కుమార్ ఉరిశిక్ష ఖ‌రారు చేస్తూ తీర్పును వెల్ల‌డించారు.

కేసు పూర్వ‌ప‌రాలు..
పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో వీరంతా అద్దె ఇంట్లో ఉండేవారు. ఇక డిసెంబర్ నుంచి వీరు గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గోనె సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌ కుటుంబం ఉంటోంది. భర్తతో విడిపోయిన మక్సూద్ భార్య చెల్లెలు బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో వారి వద్ద ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గొదాం పక్కనే ఉన్న పైభవనంలో బీహార్‌కి చెందిన శ్రీరాం, శ్యాంలు ఉన్నారు. ఇక నగరంలోని సంజయ్ కుమార్ యాదవ్ అనే వ్యక్తితో బుస్రాకు వివాహేతర సంబంధం ఉండగా.. ఈ విషయంలో తరచుగా మక్సూద్ ఇంట్లో గొడవలు జ‌రిగాయి. ఇక ఇంటిపై ఉంటున్న శ్రీ రాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేశారు. ఈ విషయం తెలుసుకున్న సంజయ్ కుమార్ పథకం ప్రకారం తొమ్మిది మందిని హతమార్చాడు.

 

వివ‌రాలు..

మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. వ‌రంగ‌ల్ హ‌త్య‌ల‌ను సిడిఆర్ ఆధారంగానే పోలీసులు ఛేదించారు. అప్ప‌టి వ‌రంగ‌ల్ పోలీసు క‌మిష‌న‌ర్ తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. ఈ కేసులో మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్‌ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ముందుగా వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్‌దాన్‌ గోదాంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్‌ మక్సూద్‌ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్‌ కుమారులు షాబాజ్‌(19), సోహిల్‌ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్‌దాన్‌ పనికి వచ్చిన బీహార్‌ వాసి సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్‌ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ సంజయ్‌ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్‌ జాన్‌పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్‌ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీసింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్‌.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్‌ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్‌ర థ్‌ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్‌ వచ్చాడు.  త‌రువాత త‌న అక్క‌కూతురు గురించి మ‌క్సూద్ భార్య నిషా నిల‌దీసింది. దాంతో మ‌క్సూద్ కుటుంబాన్ని కూడా హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

మే 20వ తేదీన మక్సూద్‌ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్‌ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్‌ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో ఉన్న మహ్మద్‌ మక్సూద్‌ ఆలం (55), అతడి భార్య నిషా ఆలం (45), కూతురు బుష్రా ఖాతూన్ ‌(20), మక్సూద్‌ కుమారులు షాబాజ్‌ ఆలం (19), సోహిల్‌ ఆలం (18)తో పాటు అదే ఖార్ఖానాలో పనిచేసే బిహార్‌ వలస కార్మికులు శ్యాం కుమార్‌షా (21), శ్రీరాం కుమార్‌షా (26) , మక్సూద్‌కు సన్నిహితుడైన మహ్మద్‌ షకీల్ ‌(30) ను ప‌క్క‌నే ఉన్న బావిలో ప‌డేసి ఇంటికి వెళ్లిపోయాడు.

కాగా ఒక హ‌త్య‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు 9 మందిని సంజయ్ హ‌త్య చేసిన‌ట్టుగా పోలీసులు త‌మ ద‌ర్యాప్తులో తేల్చారు. 25 రోజుల్లోనే పోలీసులు చార్జిషీటు దాఖ‌లు చేశారు. 57 మంది వాంగ్మూలం న‌మోదు చేశారు. నిందితుడు కేసు నుండి త‌ప్పించుకోకుండా పోలీసులు ప‌క్క‌గా స‌క్ష్యాలు సేక‌రించి కోర్టుకు స‌మ‌ర్పించారు. దీంతో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష‌ను విధించింది. బాధిత కుటుంబాల‌కు న్యాయం జ‌ర‌గ‌డంతో పోలీసులు ప‌రస్ప‌రం  మిఠాయిలు పంచుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.