రహదారిపై ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్ వాహనాలు..
వాహనాలను ప్రారంభించిన ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ సంజయ్ కుమార్
మెయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు రెండు పెట్రోలింగ్ వాహనాలను బుధవారం రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ సంజయ్ కుమార్ ప్రారంభించారు. మొయినాబాద్ పోలీస్టేషన్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వాహనాలను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ నిత్యం రహదారి రద్దీగా ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రమాదాలు నివారించేందుకు ఈ గస్తీ వాహనాలను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వాహనదారులు తమ ప్రయాణంలో ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు గురవుతున్నారని అలాంటి వారికి ఈ గస్తీ వాహనాల ద్వారా వారికి మెరుగైన వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు.

ఈ వాహనాలు పోలీస్ అకాడమీ నుంచి తోలుకట్ట చౌరస్తా వరకు ఒకటి, తోలుకట్ట నుంచి చేవెళ్ల పరిధిలోని చిట్టంపల్లి వరకు రెండవ వాహనాన్ని నియమించడం జరిగిందని అన్నారు. నిత్యం 24 గంటలు రహదారిపై గస్తీ నిర్వహించడం జరుగుతుందని మొత్తం 6 మంది సిబ్బంది ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మొయినాబాద్ సీఐ రాజు, రాజేంద్రనగర్ ట్రాఫిక్ రిజర్వుడు సీఐ లవకుమార్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీశైలంతో పాటు మొయినాబాద్ పోలీస్టేషన్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.