ఆటోను ఢీ కొన్న పాలవ్యాన్.. ఐదుగురు మృతి
సంగం: నెల్లూరు ఙల్లాలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిల్చున్న వారిపై మృత్యువు దూసుకొచ్చి ఐదుగురిని మింగేసింది. వివరాల్లోకి వెళితే.. సంగం మండలం దువ్వూరు వద్ద ఈ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై పక్కన ఆగి ఉన్న ఆటోను పాలవ్యాను వేగంగా వచ్చి ఢీ కొనడంతో దూవ్వూరు గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరణించారు. నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతుల వివరాలు.. దువ్వురు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కె.బాబు (55), టి. రమణయ్య (60), కె. మాలకొండయ్య (50), జి. శీనయ్య (50), ఎం. శీనయ్యగా గుర్తించారు.

దువ్వూరు నుంచి విడవలూరుకు చేపల వేట కోసం వెళ్తున్న కూలీలు దువ్వూరు వద్ద టాటా ఏస్ వాహనం ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు ఆసుపత్రులకు తరలించినట్లు సిఐ సురేష్ బాబు, సంగెం ఎస్ ఐ కె. శ్రీకాంత్ తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

