టెస్టింగ్, ట్రేసింగ్‌, ట్రీటింగ్.. అమ‌లు చేయాలి: ఈట‌ల‌‌

హైద‌రాబాద్: మ‌ళ్లీ దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మిగ‌తా రాష్ట్రల‌తో స‌హా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య‌ పెరుగుదల నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్ ప‌ద్ధ‌తిని అధికారులు క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. కరోనా కేసుల పెరుగుదల, చికిత్స పై వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి బుధ‌వారం ఫోన్‌లో మాట్లాడారు. కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సంద‌ర్భంగా నిర్ణయించారు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్ప‌త్రుల సూపరింటెండెంట్లు, నోడల్ అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత పెంచాల‌ని సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న కూడా తీవ్రత తక్కువగా ఉంద‌ని అధికారులు మంత్రికి వివరించారు. వాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతుందని, అయితే అందరికీ వాక్సిన్ అందించడానికి అవసరమైన డోసులు పంపించాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కోరిన‌ట్లు ఈట‌ల తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.