రజనీకాంత్‌ ఆరోగ్యం మ‌రింత మెరుగు ప‌డింది..

హెల్త్ బులెటిన్‌ విడుదల చేసిన అపోలో వైద్యులు

హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆరోగ్యం నిన్న‌టికంటే మ‌రింత మెరుగుప‌డింద‌ని అపోలో వైద్య బృందం పేర్కొంది. శుక్రవారంతో పోలిస్తే నేడు ఆయన ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు శనివారం ఉదయం రజనీకాంత్‌ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

‘రజనీకాంత్ ఆరోగ్యం, ఆయన రక్తపోటుకు సంబంధించి అందుతున్న వైద్యంపై క్లోజ్‌గా మానిటర్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఆయన రక్తపోటు ఇప్పటికి కూడా అధికంగానే ఉంది. రక్తపోటును తగ్గించేందుకు మందులు అందిస్తున్నాం. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాం. సాయంత్రానికల్లా నివేదిక వస్తుంది. ఆ తర్వాత అతనికి అందించాల్సిన చికిత్స గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. శనివారం సాయంత్రం కూడా పరీక్షలు నిర్వహించి అంతా సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకుంటాం’అని అపోలో వైద్య బృందం ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.