ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం

అంద‌రికీ ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వ‌పు శుభాకాంక్ష‌లు..

ఆరోగ్యం మ‌హా భాగ్యం అని, ఎంత సంపాదించినా ఆరోగ్యంగా లేనివాడు నిజంగా పేద‌వాడు అంటారు. ఆరోగ్యంతో ఉన్న‌వాడు నిజ‌మైన ధ‌న‌వంతుడ‌ని సూక్తులు వ‌ల్లె వేస్తుంటాం. మ‌న‌కు ఏమైనా కొంచెం ఆరోగ్యం బాగోలేక‌పోతే న‌లుగురు నాలుగు విధాల ప‌రిష్కారాలు సూచిస్తారు. వాటిలో ఏది చేయాలో తెలియ‌క అన్నీ చేసేస్తుంటాం మ‌నం. స‌మ‌యానికి తినాల‌ని, స‌రిప‌డా నిద్ర పోవాల‌ని చెపుతుంటారు. వ్యాయామం చేయాలంటారు. త‌ర‌చూ చెక‌ప్‌లు చేయించుకోవాల‌ని డాక్ట‌ర్స్ చెబుతుంటారు. ఎండ త‌గ‌లాల‌ని, ఆకుకూర‌లు. మొల‌కెత్తిన విత్త‌నాలు తిన‌మ‌ని కొంద‌రు.. ప్య్రూట్స్‌, డ్రైప్రూట్స్ తిన‌మంటారు. పాలు, గుడ్లు, చిరు ధాన్యాలు తినాల‌ని.. ఇలా ఎవ‌రికి తోచింది వారు చెబుతుంటారు. వాటిలో మ‌న‌కు న‌చ్చిన‌వి చేసేస్తుంటాం కూడా. కానీ ఆరోగ్యం బాగుందా అంటే ష‌రా మామూలే. మా ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు అనేవారే లేరే.

ప్ర‌స్తుత కాలంలో ఏ ఆహారం తీసుకుందామ‌న్నా అన్నీ కల్తీ అయిపోతున్నాయి. అది తెలిసి కూడా అంద‌రితో పాటు మ‌న‌మూ అనుకుంటూ వాటిని వాడేస్తున్నాము. క‌ల్తీ అయిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవ‌చ్చంటూ యూట్యూబ్ వీడియోస్ కూడా పుట్టుకొస్తున్నాయి.

పాలు తీసుకుందాం. చిన్న పిల్ల‌ల నుండి ముస‌లి వారు దాకా అంద‌రూ పాలు తాగుతారు. కానీ ఆపాలు క‌ల్తీ లేకుండా దొర‌క‌టం లేదు. ఎంత‌మంది ఆ పాలు క‌ల్తీవా .. కాదా అని ప‌రిశీలించి తాగుతున్నాం.. పాలు క‌ల్తీ చేయ‌డం వ‌లన వారికి ఎంత లాభం చేకూరుతుంది. ప్ర‌జ‌ల ఆరోగ్యంతో ఎందుకు ఆట‌లాడుతున్నారు. పండ్లు తిందామంటే ప‌చ్చి కాయ‌ల‌నే మందులు వేసి పండిన‌ట్లు చేస్తున్నారు. మంచిది మ‌న‌కు ఇక‌ దొర‌క‌దా.. మంచి దొర‌కాలంటే బాగా కాస్ట్లీ అయిపోయింది.

కాఫీ పౌడ‌ర్‌, టీపౌడ‌ర్ , ర‌వ్వ‌లు, ధ‌నియాల పొడిలో చెక్క పొడి క‌లిపేస్తున్నారు జాగ్ర‌త్త అంటారు.. ప్ర‌తి సారీ చెక్‌చేసుకుని వాడాలా.. మంచిది మ‌న‌కు దొర‌క‌దా.. అల్లం పేస్తు కొంటున్నాం. అది కూడా క‌ల్తీ లేకుండా దొర‌క‌డంలేదు. ఇటీవ‌ల కాలంలో ఎన్నో చోట్ల క‌ల్తీ అల్లం త‌యారు చేస్తున్న‌వారిని ప‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. మార్కెట్‌లో ర‌క‌ర‌కాల నూనెలు ఉన్నాయి. ఏది మంచిదో ఏది చెడ్డ‌దో తెలుసుకుని కొనాలి. కొన్ని నూనెలు నూట‌యాభై రూపాయ‌ల‌కే దొరుకుతున్నాయి. మ‌రికొన్ని ఐదు వంద‌లు రూపాయ‌లు ఉన్నాయి. మ‌రికొన్ని అంటే ఆలివ్ ఆయిల్ అయితే.. వెయ్యి పైనే. సాధార‌ణ ప్ర‌జ‌లు వెయ్యి రూపాయ‌ల అయిల్ వాడ‌గ‌ల‌రా..

తాగే నీరు క‌ల్తీ.. పీల్చే గాలి క‌ల్తీ,, తినే తిండి క‌ల్తీ ఎక్క‌డి నుండి వ‌స్తుంది ఆరోగ్యం.. కూల్ డ్రింక్స్ తాగ‌కూడ‌ద‌ని తెలుసు , కానీ ఎవ్వ‌రు తాగ‌కుండా ఉంటున్నారు. ఒక ప‌దార్ధం మంచిది కాద‌ని తెలిసి దానిని ఎందుకు త‌యారు చేస్తున్నారు, దానిని ఎందుకు ప్ర‌జ‌ల‌కు మీద‌కు వ‌దులుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగొద్దు అంటే ఎంత‌మంది వింటున్నారు. ఆల్క‌హాల్ తాగొద్ద‌ని అంటేనే విన‌టంలేదు క‌దా, కూల్ డ్రింక్స్ తాగితే ఏమౌతుంది అంటారా..

స్ట్రీట్‌కి పది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటున్నాయి. అక్క‌డ ఆయిల్ మంచిదికాదు. న్యూడిల్స్ తిన‌కూడ‌దు.. అని తెలిసినా ఏదో వారినికి ఒక రోజేగా అంటూ వెళుతుంటాం. ఫిజ్జాలు, మంచూరియాలు, ఎగ్‌ప‌ఫ్‌లు, వెజ్ ప‌ఫ్‌లు అనుకూంటూ లాగించేస్తాం. ఇక బిర్యానీ అయితే చెప్ప‌క్క‌ర్లేదు. అది లేక‌పోతే వీక్ ఎండ్ అవ్వ‌దు మ‌నకి. అస్త‌మానం ఇంట్లో ఏం తింటాం స‌ర‌దాగా బ‌య‌ట తిందామ‌నే వారు కొంద‌రైతే .. ఆ హోట‌ల్ కి వెళ్లాం చెప్పుకోవాల‌ని కొంద‌రు . మీకు గొప్ప కావాలా .. ఆరోగ్యం కావాలా..

అన్నీ తెలిసీ కూడా ఏదీ పాటించం.. కానీ, హెల్త్ సెమినార్‌ల‌కు అటెండ‌వుతాం. హెల్త్ టిప్స్ కోసం గూగుల్ వెతుకుతుంటాం. పొద్దున్నే బ‌య‌ట‌కు వెళ్లాలంటే ముఖానికి స‌న్‌స్క్రీన్ లోష‌న్ రాయందే వెళ్ల‌లేరు. బాడీకి మాయిశ్చ‌రైజ‌ర్లు, వేజ్‌లైన్స్ లిప్‌స్టిక్స్ .. మేక‌ప్ లేనిదే బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థ‌తి. అవి ప‌డ‌క ఎల‌ర్జీలు మొద‌లైతే మ‌రో క్రీమ్ వాడ‌తారు. ఇలా బ్యూటీ టిప్ప్ కోసం వెతుకులాట‌. ఇక యూట్యూబ్‌లో అయితే వేల‌కు వేలు హెల్త్ టిప్స్ వింటుంటాం. ఆరోగ్యం గురించి చిన్న టిప్ దొరికితే చాలు ఎంతో ఆస‌క్తిగా వింటాం. వాళ్లు ఏది చెప్తే ఆ యోగాస‌నాలు చేస్తుంటాం. చివ‌ర‌కు ఫ‌లితం లేద‌ని డాక్ట‌ర్‌ను క‌లుస్తాం. అంతా అయిపోయాక డాక్ట‌ర్ కాదు క‌దా ఆ దేవుడు కూడా ఏం చేయ‌లేడు.

తీరా డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాక మ‌న‌కొచ్చిన నొప్పేంటే తెలుసుకునేందుకు పావుసేరు ర‌క్తం తీసి టెస్టులు చేశాక కూడా తెలియ‌దు. ఈలోపు ఓ ప‌ది ప‌దిహేను రోజులు.. ప‌ది ప‌దిహేను వేలు అయిపోతాయి. ఈ విష‌యాలన్నీ మ‌న‌కు తెలుసు. అయినా కూడా మ‌నంకూడా అందిరితో పాటే అంటూ ఉంటాం. అన్ని విష‌యాలు తెలుసుకాబ‌ట్టే ఏదీ చేయ‌మ‌న‌డంలేదు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌.

-Teja

Leave A Reply

Your email address will not be published.