అమ్మకు బోనం… తెలంగాణకు ఆత్మగౌరవం!
ఆషాఢం వచ్చిందంటే చాలు… తెలంగాణ పల్లెల నుంచి హైదరాబాద్ వీధుల దాకా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతాయి.
డప్పుల దరువులు… పోతరాజుల వీర విన్యాసాలు… శివసత్తుల పూనకాలు… నెత్తిన బోనంతో కదిలివచ్చే ఆడపడుచులు… ఎటుచూసినా భక్తి పారవశ్యమే. ప్రపంచంలో మరెక్కడా కనిపించని ప్రత్యేకమైన జానపద ఆధ్యాత్మిక సంప్రదాయానికి తెలంగాణ బోనాలు అద్దం పడతాయి.
అమ్మవారికి భక్తితో వండిన అన్నం, పాలు, బెల్లం, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాన్ని సమర్పించడం వెనుక తరతరాల విశ్వాసం ఉంది. అమ్మకు బోనం పెడితే ఇంటికి, వాడకు, ఊరికి కీడు రాదని… వ్యాధులు దరిచేరవని… అమ్మ చల్లని చూపుతో కాపాడుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మతల్లి వంటి గ్రామదేవతలను కొలుస్తూ ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు.
ఇది కేవలం ఓ పండుగ కాదు… తెలంగాణ మట్టి వాసనను, ఆడబిడ్డల ఆత్మీయతను, జానపద కళలను, సామూహిక జీవన స్ఫూర్తిని ఒకే వేదికపైకి తీసుకొచ్చే సాంస్కృతిక వేడుక. ఆషాఢం, శ్రావణ మాసాల్లో అమ్మవార్లకు బోనాలు సమర్పించే ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతూ తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.
అమ్మకు బోనం… మనసుకు భరోసా… కుటుంబానికి ఆశీర్వాదం… తెలంగాణ సంస్కృతికి చిరునామా!
-ఎస్.వి.రమణా చార్య
సీనియర్ జర్నలిస్టు
సెల్ : +91 98498 87086
Also Read: నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం