దక్షిణ కొరియాలో తెలంగాణ ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యటన
హైదరాబాద్ (CLiC2NEWS) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అత్యాధునిక భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రాలు (Underground STPs), నీటి పునర్వినియోగ వ్యవస్థల అధ్యయనం కోసం తెలంగాణకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఈ అధ్యయన పర్యటన కొనసాగనుంది.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) ఎండీ ఈ.వి. నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, అధికారుల బృందం గ్వాంగ్‌మియాంగ్‌లో 250 ఎంఎల్డీ అండర్‌గ్రౌండ్ ఎస్టిపి పరిశీలించారు. పట్టణ మురుగునీటి నిర్వహణ, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే అవకాశాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
ఈ బృందంలో జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి, MRDCL ఎండీ ఈ.వి. నరసింహారెడ్డి, ఐఏఎస్, జలమండలి సీజీఎం ఎం. సుజాత, డీజీఎం జె. శివ, ఎంఆర్డీసీఎల్ ఇఇ జాకీర్ హుస్సేన్ ఉన్నారు.
250 ఎంఎల్డీ భూగర్భ ఎస్టీపీ పరిశీలన:
పర్యటనలో భాగంగా బుధవారం అధికారుల బృందం గ్వాంగ్మియాంగ్లోని 250 ఎంఎల్డీ సామర్థ్యం గల అత్యాధునిక భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించింది. పూర్తిగా భూగర్భంలో నిర్మించిన ఈ ఆటోమేటెడ్ టెర్షియరీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనితీరు, దుర్వాసన నియంత్రణ వ్యవస్థలు, శుద్ధి ప్రక్రియలను అధికారులు అధ్యయనం చేశారు.
ఈ ప్లాంట్‌లో మురుగునీటి శుద్ధితో పాటు బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణహిత పద్ధతుల్లో స్లడ్జ్ నిర్వహణ చేపడుతున్న విధానాన్ని పరిశీలించారు. ముఖ్యంగా ఎస్టీపీని పూర్తిగా భూగర్భంలో నిర్మించి, దాని పైభాగాన్ని పార్కులు, క్రీడా ప్రాంగణాలు, ఆట స్థలాలు వంటి ప్రజా అవసరాలకు వినియోగించడం పట్ల బృందం ప్రత్యేకంగా అధ్యయనం చేసింది.
సాధారణ ఎస్టీపీలతో పోలిస్తే తక్కువ స్థలంలో, పరిసర ప్రాంతాలకు దుర్వాసన వంటి ఇబ్బందులు లేకుండా భారీ సామర్థ్యంతో మురుగునీటిని శుద్ధి చేసే ఈ విధానంలోని సాంకేతిక, పర్యావరణ ప్రయోజనాలను అధికారులు పరిశీలించారు.
చియోంగ్‌గ్యేచియోన్ నది పునరుజ్జీవన ప్రాజెక్టు అధ్యయనం:
అనంతరం అధికారుల బృందం చియోంగ్‌గ్యేచియోన్ పట్టణ నది పునరుజ్జీవన ప్రాజెక్టును పరిశీలించింది. నదిలో నీటి నాణ్యత పెంపు, ఎగువ–దిగువ స్థాయుల్లో ఏర్పాటు చేసిన ప్రొమెనేడ్లు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన రివర్‌ఫ్రంట్ ప్రాంతాలను అధ్యయనం చేసింది.
ప్రకృతి ఆధారిత పరిష్కారాలతో చిత్తడి నేలలు, సహజ ఆవాసాలను పునరుద్ధరించడం ద్వారా వృక్షజాలం, చేపలు, పక్షులు, కీటకాల జీవవైవిధ్యాన్ని తిరిగి అభివృద్ధి చేసిన విధానాన్ని పరిశీలించింది. వరదలను తట్టుకునే మౌలిక వసతులు, దీర్ఘకాలిక నిర్వహణ, ప్రజలకు ఉపయోగపడే విధంగా నదీ తీర ప్రాంతాల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.
మరికొన్ని కీలక ప్రాజెక్టుల పరిశీలన:
ఈ అధ్యయన పర్యటనలో భాగంగా అన్యాంగ్ పబ్లిక్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సియోల్‌లోని హాన్ నది కారిడార్, ప్యోంగ్టెక్లోని గోడెక్ పబ్లిక్ వేస్ట్‌వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లోని వివిధ దశలను అధికారుల బృందం పరిశీలించనుంది. అలాగే KIND (Korea Overseas Infrastructure & Urban Development Corporation) ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొననుంది.
దక్షిణ కొరియాలో అమలవుతున్న భూగర్భ ఎస్టీపీలు, నీటి పునర్వినియోగం, దుర్వాసన నియంత్రణ, స్థల వినియోగం, నదుల పునరుజ్జీవనానికి సంబంధించిన అత్యాధునిక విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం, తెలంగాణలో వీటిని అమలు చేసే సాధ్యాసాధ్యాలు, అవసరమైన సాంకేతిక విధానాలతో కూడిన సమగ్ర నివేదికను అధికారుల బృందం ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.