‘ఆపరేషన్ చబుత్రా’: అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలపై ప్రత్యేక నిఘా

గంజాయి స్పాట్లు, బెల్ట్ షాపులు, అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలపై ప్రత్యేక నిఘా

గోదావరిఖని (CLiC2NEWS): అనవసరంగా అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారే లక్ష్యంగా పోలీసులు త‌నిఖీలు (‘ఆపరేషన్ చబుత్రా’) నిర్వ‌హించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1 టౌన్, ఎన్టీపీసీ, రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో, ‘ఆపరేషన్ చబుత్రా’ నిర్వహించారు.

పోలీస్ అధికారులు, సిబ్బంది బైక్‌లపై పెట్రోలింగ్ నిర్వహిస్తూ రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు,వీధులు, రోడ్లపై గుంపులుగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని, మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న యువకులను, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో 30 మంది యువకులను, వారి ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేసి.. ప‌ట్టుబ‌డిన యువ‌కుల‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడి పట్టుబడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ..
రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా యువకులు రోడ్లపై విన్యాసాలు చేస్తూ లేదా గుంపులుగా తిరుగుతూ కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకుని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి, రాత్రి వేళల్లో అనవసరంగా బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు.

‘ఆపరేషన్ చబుత్రా’లో పట్టుబడిన వారి వాహనాలను స్వాధీనం చేసుకుని, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏసీపీ తెలిపారు.ఈ ఆపరేషన్ చబుత్రా లో గోదావరిఖని 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అఫ్జలోద్దీన్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐలు మనోహర్, రామగుండం ఎస్‌ఐ సంధ్య,అంతర్గం ఎస్‌ఐ వెంకట స్వామి తో పాటు పోలీస్ స్టేషన్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

‘ఆపరేషన్ చబుత్రా’: అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలపై ప్రత్యేక నిఘా

Leave A Reply

Your email address will not be published.