Mandapeta: రైతులకు అండగా బిజెపి..
రాష్ట్ర అధ్యక్షుని పిలుపుతో మండపేటలో నిరసన దీక్ష..
మండపేట (CLiC2NEWS): రాష్ట్రంలో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి అందరికీ అన్ని కష్టాలే నని, జగన్ సర్కారు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ కష్టపడి పండించిన రైతులకు కష్టాన్ని వర్షార్పణం చేస్తున్నారని మండపేట నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కోన సత్య నారాయణ విమర్శించారు. నెలల తరబడి తమ రెక్కల కష్టంతో పండించిన పంటకు మద్దతు ధర చెల్లించకుండా, మిల్లర్లకు దోచి పెడుతూ, అన్నదాతల కష్టాలను కన్నీరుగా మార్చి, వ్యవసాయ రంగంపై వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు రైతులకు న్యాయం చేయాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం లో భాగంగా మండపేట పార్టీ కార్యాలయ ఆవరణలో బిజెపి నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ కోవిడ్ నియమావళిని అనుసరిస్తూ మంగళవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు తుమ్మగంటి వెంకన్న, ఆకుల సీతారామ మూర్తి, పట్టణ వైస్ ప్రెసిడెంట్ నాళం ఫణి ప్రకాష్, వై విజయ, జక్కా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.