అంకిత భావంతో సేవలందించే వారిని ప్రజలు గుర్తుంచుకుంటారు..
పోస్ట్ మెన్ రామయ్య సేవలు నిరుపమానం..
రామచంద్రపురం (CLiC2NEWS): విధి నిర్వహణలో మంచి సేవలందించిన ఉద్యోగులను ప్రజలు, సాటి ఉద్యోగులు కలకాలం గుర్తు పెట్టుకుంటారని అటువంటి కోవలో గ్రామీణ పోస్ట్ మెన్ జి వి కె జి రామయ్య చెందుతారనడంలో ఎటువంటి సందేహం లేదని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజలు కొనియాడుతున్నారు.
తపాల శాఖలో మూడు దశాబ్దాల పాటు అలుపెరుగని సేవలు అందించి అటు ఉద్యోగులు, ఇటు సమాజంలోనూ అందరి ఆదరాభిమానాలు సంపాదించుకున్న పోస్ట్ మెన్ రామయ్య బుధవారం పదవీ విరమణ చేశారు.
రామచంద్రపురం మండలం తాళ్లపొలం గ్రామ పోస్ట్ మెన్ గా పనిచేసిన రామయ్యను పలువురు అభినందించి ఆయన సేవలను కొనియాడారు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా, కార్యదర్శిగా తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అలుపెరగని పోరాటాలు చేసి, అందరికీ వెన్నుదన్నుగా నిలిచి, ఎన్నో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు, ప్రజలకు, ఇతరులకు ఏ సమస్య ఉన్నా నాది అని భుజాన వేసుకుని వాటిని పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి.
గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రామచంద్రపురం శాఖ అధ్యక్షునిగా, కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వివిధ హోదాలలో పనిచేసి ఉద్యోగుల అందరి మన్ననలను ఆయన అందుకున్నారు.
మూడు దశాబ్దాలకు పైగా తపాలా శాఖలో సేవలందించి అప్పుడే పదవి విరమణ పొందడాన్ని పలువురు నమ్మలేకుండా ఉన్నారు. శేష జీవితాన్ని ఆనందంగా, సుఖ సంతోషాలతో గడపాలని రామచంద్రపురం గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్ వి వి మునేశ్వరరావు, కోశాధికారి వై కామేశ్వరి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గండ్రోతు రామకృష్ణ, వి వీరయ్య చౌదరి, కొప్పిశెట్టి వెంకటరమణ ఆకుల సాయి, కోలపల్లి శ్రీనివాసులు కోరుకుంటున్నారు.
అలాగే గ్రామీణ పోస్ట్ మెన్ జి వి జి కె రామయ్య పదవీ విరమణ సందర్భంగా పోస్టల్ పెన్షనర్ల సంఘం నాయకులు సలాది సత్య నారాయణమూర్తి, బి రామ గంగాధరం, టి పుల్లేశ్వరరావులు పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. పోరాట యోధునిగా, కార్మిక నాయకునిగా రాష్ట్రంలో పేరుగాంచిన రామయ్యకు తమ సంఘం ఆధ్వర్యంలో కోవిడ్ అనంతరం ఘన సన్మానం కార్యక్రమం జరుగుతుందని రామచంద్రపురం గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఎస్ వి వి మునేశ్వరరావు తెలిపారు.