నిరసనలకు బహిరంగ ప్రదేశాలు వేదిక కాకూడదు

షాహీన్‌బాగ్‌ నిరసనలపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : బహిరంగ ప్రదేశాల్లో నిరవధికంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. నిరసనల పేరుతో బహిరంగ ప్రదేశాలను, ప్రజలు ఉపయోగించుకునే ప్రదేశాలను ఆక్రమించుకోవడం సరికాదని న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌ నిరసనలపై దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు .. అయితే బహిరంగ ప్రదేశాల్లో, ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిరసనలు తెలపడం కూడా సమంజసం కాదంటూ సుప్రీంకోర్టు హితవు పలికింది. అసమ్మతి, ప్రజాస్వామ్యం రెండూ కలిసే వుంటాయని, అయితే ఆందోళనలు చేపట్టేందుకు ప్రత్యేక ప్రాంతాలు అవసరమని జస్టిస్‌ సంజయ్కౌల్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని, అదే సమయంలో బహిరంగ ప్రదేశాలు అందుకు వేదిక కాకూడదని ధర్మాసనం పేర్కొంది.
సిఎఎకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ షహీన్‌బాగ్ ప్రాంతంలో నిరసన కారులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నిరసనలతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందంటూ అమిత్ సాహ్ని అనే వ్యక్తి సుప్రీంలో పిల్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం పై విధంగా తీర్పునిచ్చింది

Leave A Reply

Your email address will not be published.