సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డిజెల‌కు అనుమతి లేదు

ప్రశాంతంగా గణేష్ నవరాత్రులు, నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలి: డీసీపీ బి.రామ్ రెడ్డి

రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్‌

గోదావరిఖని (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులతో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కోదండ రామాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి డిసిపి బి. రామ్ రెడ్డి, గోదావరిఖని సబ్ డివిజన్ ఇన్‌చార్జ్ ఎసిపి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిసిపి బి.రామ్ రెడ్డి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డీజే శబ్దం ప్రజల ఆరోగ్యంపై, ముఖ్యంగా గుండె సంబంధిత ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున డీజే వినియోగంపై నిషేధం అమల్లో ఉందన్నారు. కాబట్టి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలో ఎవరూ డీజేలను వినియోగించరాదని సూచించారు.

గోదావరిఖని ప్రజలు ఎల్లప్పుడూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తూ, పోలీసుల సూచనలు, నిబంధనలను పాటిస్తున్నారని డిసిపి తెలిపారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చి గోదావరిఖనిలో నివసిస్తున్న ప్రజలు స్థానిక ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ ఐకమత్యంతో జీవిస్తున్నారని, అందుకే గోదావరిఖనికి ‘మినీ మాంచెస్టర్’ గా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

అదే స్ఫూర్తితో గణేష్ నిమజ్జనాన్ని కూడా అందరూ కలిసి ప్రశాంతంగా, ఆనందంగా నిర్వహించాలని కోరారు.నిమజ్జన శోభాయాత్రను వీలైనంత త్వరగా ప్రారంభించి, మధ్యాహ్నం ప్రారంభిస్తే సాయంత్రం 5 లేదా 6 గంటలలోపు ప్రధాన చౌరస్తాకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రధాన చౌరస్తా నుంచి గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశానికి శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగించాలని తెలిపారు.
డీజే నిషేధం కేవలం పోలీసుల ఆదేశం కాదని,సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో భాగమని డీసీపీ స్పష్టం చేశారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.భక్తిశ్రద్ధలతో నిర్వహించే పవిత్రమైన గణేష్ ఉత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఇబ్బందులు, నష్టాలు తెచ్చుకోకుండా భక్తి, భద్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించి, భవిష్యత్తులో అందరూ సంతోషంగా గుర్తుచేసుకునే విధంగా జరుపుకోవాలని డీసీపీ కోరారు. మండప నిర్వాహకులు పోలీసులు, ఉత్సవ కమిటీ సూచించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

మండప నిర్వాహకులు పాటించవలసిన ముఖ్య నియమాలు

విగ్రహం ఏర్పాటు ముందు:

1. వివాదాస్పద స్థలాల్లో,ఇతర మతాలకు చెందిన స్థలాల్లో లేదా ప్రార్థనా మందిరాలకు ఆనుకుని గణేష్ మండపాలను ఏర్పాటు చేయరాదు.
2. మండపం రహదారికి అడ్డంగా ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించరాదు.
3. వర్షాలను దృష్టిలో ఉంచుకుని మండపంలోకి నీరు రాకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి.
4. భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే Entry, Exit మార్గాలను ఏర్పాటు చేయాలి.
5. విద్యుత్ విషయంలో నాణ్యమైన వైర్లను మాత్రమే ఉపయోగించి, వైర్లకు అనధికారిక అతుకులు లేకుండా చూసుకోవాలి. సంబంధిత శాఖ అధికారుల ద్వారా విద్యుత్ కనెక్షన్ పొందాలి.
6. గణేష్ మండపానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పోలీస్ శాఖకు సమాచారం అందించాలి.

విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత:

1. మండపం వద్ద కనీసం ఇద్దరు నిర్వాహకులు రాత్రింబవళ్లు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
2. కానుకల కోసం సక్రమంగా హుండీ ఏర్పాటు చేసి, దానికి భద్రత కల్పించాలి.
3. అగ్ని ప్రమాదాల నివారణకు మండపం వద్ద నీటితో నిండిన డ్రమ్, మూడు బ్యాగుల ఇసుక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
4. ప్రసాదాలు, తినుబండారాల విషయంలో జంతువులు, ఇతరులు వాటిని ముట్టకుండా తగిన పర్యవేక్షణ ఉండాలి.
5. సౌండ్ సిస్టమ్ వల్ల చుట్టుపక్కల కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
6. ఇతర మతాలను కించపరిచే లేదా అవమానించే విధంగా ఎలాంటి ప్రసంగాలు, పాటలు ప్రసారం చేయరాదు.
7. మండపం వద్ద మద్యం సేవించడం, పేకాట, పందాలు లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అనుమతించరాదు.
8. మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
9. మండపం వద్ద నిర్వహించే కార్యక్రమాలను రాత్రి 10 గంటలలోపు ముగించాలి.
10. మండపం వద్ద డీజే లేదా డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
11. అన్నదానం లేదా ఇతర పంపిణీ కార్యక్రమాల అనంతరం వ్యర్థాలను వెంటనే తొలగించేలా మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలి.
12. మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
13. గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించిన తేదీన విగ్రహ నిమజ్జనం తప్పనిసరిగా పూర్తి చేయాలి.

నిమజ్జనం రోజు పాటించవలసిన నియమాలు:

1. నిమజ్జనం రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి వాహనాన్ని సిద్ధం చేసుకుని, పూజలు, అలంకరణ పూర్తిచేసి సుమారు సాయంత్రం 4 గంటలకు మండపం నుంచి బయలుదేరాలి. ముందుగా నిర్ణయించిన మార్గంలో ప్రయాణించి గోదావరి వద్ద సురక్షితంగా నిమజ్జనం పూర్తి చేయాలి.
2. నిమజ్జన ఊరేగింపులో విగ్రహాన్ని తరలించే వాహనంపై చిన్నపిల్లలను ఎక్కించరాదు.
3. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను విగ్రహ ఊరేగింపులో పాల్గొనకుండా చూడాలి.
4. ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగించరాదు.
5. ఇతర మతాల ప్రార్థనా మందిరాల వద్ద వివాదాస్పద వ్యాఖ్యలు, పాటలు, నృత్యాలు చేయరాదు. రంగులు చల్లరాదు.
6. గత సంఘటనలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వైర్లు, ఇతర విద్యుత్ పరికరాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
7. నిమజ్జన ప్రదేశంలో విగ్రహాన్ని క్రేన్‌లోకి ఎక్కించే బాధ్యత ఎవరికి అప్పగించాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. సంబంధిత వ్యక్తులు మాత్రమే నిమజ్జన ప్రదేశంలో ఉండాలి.
8. నిమజ్జన ప్రదేశంలో ‘O’ పద్ధతిని పాటిస్తూ విగ్రహాలు త్వరగా నిమజ్జనం అయ్యేలా పోలీసులకు, నిర్వాహకులకు సహకరించాలి.
9. విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి వర్గ విభేదాలకు తావివ్వకుండా, ఎవరు ముందుగా వెళ్లే ప్రయత్నం చేసినా వారికి దారి ఇచ్చి సహకరించాలి.
10. నిమజ్జన ప్రదేశంలో పోలీసులు, మైక్ ద్వారా చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ క్రమపద్ధతిలో సంబంధిత క్రేన్ వద్దకు వెళ్లి విగ్రహ నిమజ్జనం చేయాలి.

గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా , ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు మండప నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు కోరారు.

Also Read:  వారెవ్వా..! ఏమి డ్ర‌స్సు..!

Leave A Reply

Your email address will not be published.