బిఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారు..
దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్ (CLiC2NEWS): బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టి నుండి ఇంకా వలసలు కొనసాగుతాయని, బిఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో నాగేందర్ మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పై నమ్మకం లేకే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ చేరుతున్నారని.. పార్టీలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారన్నారు. బిఆర్ఎస్ను కెటిఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని, పార్టిలోని ఎమ్మెల్యేలకు కెసిఆర్ అపాయింట్మెంట్ కూడా దొరకేది కాదన్నారు. ఒక వేళ దొరికినా గంటలు తరబడి నిలబెట్టేవారని ఆరోపించారు. విలువ లేని చోట ఉండలేక కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు.