మీటర్ రీడర్లను తొలగించడం లేదు – పుకార్లను నమ్మవద్దు

క్రమబద్ధీకరణ అంశంపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): జలమండలిలో ప్రస్తుతం పనిచేస్తున్న మీటర్ రీడర్లలో ఎవరినీ విధుల నుంచి తొలగించడం లేదని.. తొలగించే ఉద్దేశం కూడా లేదని జలమండలి స్పష్టం చేసింది. ఈ అంశంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరింది.

తమను క్రమబద్ధీకరించాలని మీటర్ రీడర్లు కోరుతున్న నేపథ్యంలో, వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని సంబంధిత ప్రతిపాదనలను జలమండలి ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. వారిని అవుట్ సోర్సింగ్ విధానంలో కొనసాగించే అంశాన్ని కూడా ప్రతిపాదనల్లో పొందుపరిచింది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలియ‌జేసింది. ఈ విషయంపై చర్చించి తగిన నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు జలమండలి వెల్లడించింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలు చేపడతామని పేర్కొంది.

మీటర్ రీడర్ల విజ్ఞప్తుల నేపథ్యంలో గతంలో చేపట్టిన టెండర్ల ప్రక్రియను కూడా నిలిపివేసినట్లు తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన తదుపరి చర్యల కోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించినట్లు వివరించింది.

పెండింగ్ జీతాలపై చర్యలు

మీటర్ రీడర్లకు సంబంధించిన పెండింగ్ జీతాల విషయంలో కూడా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు జలమండలి తెలిపింది. సంబంధిత ఏజెన్సీలకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను గురువారం విడుదల చేసినట్లు పేర్కొంది.

కొన్ని నెలలకు సంబంధించిన హాజరు వివరాలను ఏజెన్సీలు ఆలస్యంగా సమర్పించడం వల్ల బిల్లుల పరిశీలన, చెల్లింపు ప్రక్రియలో కొంత జాప్యం జరిగినట్లు వివరించింది. హాజరు వివరాలను పరిశీలించిన అనంతరం అర్హత మేరకు బిల్లులను విడుదల చేస్తున్నామని తెలిపింది. జలమండలి నుంచి బిల్లులు విడుదలైన అనంతరం సంబంధిత ఏజెన్సీలు మీటర్ రీడర్లకు జీతాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

అందువల్ల మీటర్ రీడర్లను తొలగిస్తున్నారని, వారి జీతాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జలమండలి మరోసారి స్పష్టం చేసింది. మీటర్ రీడర్ల సమస్యలపై జలమండలి సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని, ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, మంగళవారం జరిగే సమావేశంలో ఈ అంశంపై తదుపరి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అంశంపై అనవసర పుకార్లు, అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.

 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డిజెల‌కు అనుమతి లేదు

Leave A Reply

Your email address will not be published.