Goa: ప‌ర్యాట‌కులకు స్వ‌ర్గ‌ధామం!

ప‌నాజి (CLiC2NEWS): గోవా ఇండియా, పోర్చ్ గీస్ కల్చర్ తో సమ్మేళనమై ఉంటుంది. ఇది పోర్చుగీసు వారు మనకు ఇచ్చిన బహుమతిగా కూడా పేర్కొంటారు. యునెస్కో గోవాలో చారిత్రక కట్టడాలకు గుర్తింపుని ఇచ్చారు. ఇక్కడ అందమైన చర్చిలు.. అద్భుతంగా పోర్చుగీసు వారి కళా వైభవాన్ని తెలియజేస్తాయి.

గోవా అంటేనే బీచ్ ల‌కు ప్రసిద్ధి.. ఇక్క‌డ అద్భుత‌మైన చారిత్రాత్మక పట్టణాలు ఉన్నాయి. ప‌ర్యాట‌కుల‌ కోసం ఈ బీచ్ ల‌లో వాటర్ స్పోర్ట్స్ గేమ్స్, క్యూబా డైవింగ్, పారాషూట్ ఫ్లయింగ్ తదితర రకరకాలైన గేములు అందుబాటులో ఉంటాయి.

గోవాలోని డోనా పౌలా బీచ్ (పంజిమ్)

గోవా ఆహ్లదకరానికి ప్రత్యేకమైన చోటు. దేశ విదేశాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు గోవాకి వచ్చి సేదదీరుతారు. గోవాలో రకరకాలైన బీచ్ లు ప్రకృతి పారవశ్యంతో మైమరిచి పోయేటట్లు చేస్తాయి. ఈ బీచ్ ల‌లో ప్రకృతిని ఆస్వాదిస్తారు. ఇక్కడ మద్యం కూడా తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. గోవాను చూస్తే ఇది భారతదేశంలోనే ఉందా అన్న అపోహ ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే అబ్రాడ్ లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే భారతదేశంలోని ప్రజలు విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలంటే ముందుగా ఆ అనుభూతిని గోవాలో అనుభవించాల్సిందే…

గోవాలో స‌ముద్రంపై తీగ‌ల వంతెన‌

ప‌దుల సంఖ్య‌లో అద్భుత బీచ్ లు..

గోవాలో ముఖ్యంగా బాగా బీచ్, కాలం గొట్ బీచ్, క్యాండిలం బీచ్, అంజనా బీచ్, డోనా పాల్ బీచ్, అగొండ బీచ్, బటర్ ఫ్లై బీచ్, పోర్ట్ బీచ్ ఇలా చాలా రకాలైన బీచ్ లు ఉన్నాయి. ఈ బీచ్ లన్నీ ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి బీచ్ లే. ఇక్కడ కూర్చుండి ప్రకృతిని ఆస్వాదిస్తే సమయం ఇట్టే గడిచిపోతుంది. రాత్రిళ్ళు ప్రత్యేకతమైన లైటింగ్ తో, డిజె సౌండ్స్ తో, నైట్ క్యాండిల్ డిన్నర్ లతో బీచ్ ల ప్రాంగణమంతా ఆహ్లాదకరంగా ఉంటాయి.

డిసెంబర్ చివరివారం, జనవరి మొదటి వారంలో (అంటే డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు) గోవాలో క్రిస్మస్ పండుగ వేడుకలు, కొత్త సంవత్సర వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. మధ్యాహ్న సమయంలో కూడా మిరుమిట్లు గొలిపేటట్లు విభిన్నమైన కాంతులతో రెయిన్ బో ఏర్పడినట్లుగా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు.

పనాజీలో క్యాసినోల ప్రాంతం..

నైట్ క్యాండిల్ డిన్న‌ర్ లు అద్భుతం..

గోవాలో క్యాసినోలు మరో అద్భుతం. రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్ని వయసులోని వారు మద్యం సేవిస్తూ, డాన్సులు చేస్తూ, రకరకాల గేమ్ లు ఆడుతూ రాత్రి సమయం అనేది తెలవకుండానే తెల్లారిపోతుంది.

ప‌నాజీలో Big Daddy క్యాసినో

ఒకప్పుడు విదేశాలలో క్యాసినోలు ఉంటాయని మనం పుస్తకాలలో చదువుకునేవాళ్లం. కానీ ఇప్పుడు గోవాలో మనం క్యాసినోలను ఆస్వాదించవచ్చు. నైట్ క్యాండిల్ డిన్నర్ లు, క్రూజ్ లలో డిన్నర్ లు చాలా మంచి అనుభూతిని అందిస్తాయి.

ఆహ్లాద‌క‌ర‌మైన స‌ముద్ర‌యానం..

అదేవిధంగా సముద్రంలోనికి వెళ్లాలని అంటే మనకు చాలా బోట్లు, క్రూయిజ్ లు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అతిదగ్గరనుండి డాల్ఫీన్ లను చూడొచ్చు, ఐలాండ్ వెళ్లి అక్కడి ప్రకృతిలో సేద తీరవచ్చు. స్వచ్ఛమైన నీటిలో సముద్రపు స్నానాలు చేయడం మరో మైమరపు. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఇక్కడి రిసార్ట్లలో సేదతీరవచ్చు.

పాల‌నుర‌గ‌ల జ‌ల‌పాతాలు..

అదేవిధంగా పనాజీకి కొద్ది దూరంలో దూద్ సాగర్ జలపాతం ఉంటుంది. అది చాలా ఎత్తైన ప్రదేశం నుంచి పాల నురగలాగా పారుతూ ఆ జలపాతం పైనుండి ట్రైన్ వెళుతూ ఉంటే చూసేవారిని ఇట్టే కట్టిపడేస్తుంది. అక్కడికి వెళ్లాలంటే ప్రత్యేకమైన బొలిరో వాహనాలలో మాత్రమే కొండలను దాటుకుంటూ అడవిలో ప్రయాణం చేసి ఆ జలపాతాన్ని ఆస్వాదించవచ్చు. ఆనందించాలంటే గోవాను ఆస్వాదించాల్సిందే..

-కొడకల గోవర్ధన్ ముదిరాజ్
సీనియర్ జర్నలిస్ట్
సెల్‌: +91 90599 99259

గోవాలో మిత్రుల‌తో జ‌ర్న‌లిస్టు కొడకల గోవర్ధన్ ముదిరాజ్

 

Also Read: ఢిల్లీ-వాషింగ్ట‌న్: ఎయిరిండియా స‌ర్వీసులు ర‌ద్దు..

Leave A Reply

Your email address will not be published.