డ్రగ్స్ కేసుకు సంబంధించి కెటిఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: రేవంత్‌కు కోర్టు ఆదేశం
హైదరాబాద్(CLiC2NEWS): డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు, ఈడీ కేసులకు సంబంధించి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీచేసింది.
తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ పరువు నష్టం కలిగించారని మంత్రి కెటిఆర్ సోమవారం పరువునష్టం దావా వేయగా వివరాలు సక్రమంగా లేవని చెప్పడంతో మంగళవారం మరోసారి మంత్రి దావా వేశారు.
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో రేవంత్ రెడ్డిపై మంత్రి కెటిఆర్ పరువు నష్ట దావా పిటిషన్ వేయగా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సిటీ సివిల్ కోర్ట్ 3వ అదనపు సీనియర్ న్యాయమూర్తి ఆ పిటిషన్‌పై విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు, ఈడీ కేసుల్లో కేటీఆర్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు సూచించింది. అక్టోబర్ 20వ తేదీకి విచారణ వాయిదా వేసింది.