గాంధీ.. ఒక జ్ఞాపకం కాదు.. భవిష్యత్‌కు మార్గదర్శకం!

కాలం మారుతోంది… సాంకేతికత పరుగులు పెడుతోంది… మనిషి చేతిలో ప్రపంచాన్ని మార్చగలిగేంత శక్తి వచ్చింది. కానీ అదే సమయంలో మనసుల మధ్య దూరం, అసహనం, హింస, స్వార్థం కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో గాంధీని గుర్తు చేసుకోవడం అంటే ఒక మహానుభావుడి జయంతిని జరుపుకోవడం మాత్రమే కాదు… మనం ఎటు వెళ్తున్నామో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవడం.

“సత్యం”, “అహింస”, “స్వదేశీ”, “స్వచ్ఛత”, “సాధారణ జీవనం”, “సర్వోదయం” వంటి గాంధీ ఆలోచనలు స్వాతంత్ర్య పోరాట కాలానికే పరిమితమైనవి కావు. మనిషి మరింత ఆధునికమవుతున్న కొద్దీ… ఆ విలువల అవసరం మరింత పెరుగుతోంది. సోషల్ మీడియా యుగంలో నిజం–అబద్ధం మధ్య తేడా గుర్తించడం, విభేదాల సమయంలో హింసకు బదులు సంభాషణను ఎంచుకోవడం, వినియోగ సంస్కృతిలో అవసరం–అత్యాశ మధ్య గీతను గుర్తించడం.. ఇవన్నీ గాంధీ ఆలోచనలకు నేటి కాలంలో కొత్త అర్థాలు.

వర్ధమాన తరాలకు గాంధీ చెప్పే సందేశం.. విజయం అంటే ఎదుటివాడిని ఓడించడం కాదు; మనలోని అసత్యాన్ని, ద్వేషాన్ని, స్వార్థాన్ని జయించడం. భవిష్యత్ తరాలకు ఆయన ఆలోచనలు మరింత విలువైనవిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే సాంకేతికత మనిషికి ఎంత శక్తినిచ్చినా… ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించేది విలువలే.

అందుకే గాంధీని కేవలం చరిత్ర పుస్తకాల్లోని చిత్రం నుంచి బయటకు తీసి… మన జీవన విధానంలోకి తీసుకురావాల్సిన సమయం ఇది.

గాంధీని స్మరించడం ఒక ఆచారం కావచ్చు…
గాంధీని ఆచరించడం మాత్రం ఒక బాధ్యత!

-ఎస్.వి.రమణా చార్య
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు
సెల్‌: +91 98498 87086

Read Also: టైం ఆగిపోతే.. — మంజుల పత్తిపాటి

Leave A Reply

Your email address will not be published.