LockDown: Post Office పని వేళల్లో మార్పులు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో లాక్‌డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్టాఫీసుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు వెల్లడించారు. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కొవిడ్ ఉధృతి నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో గురువారం నుంచి మార్పు చోటు చేసుకోనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.
కేవలం 50 శాతం మంది సిబ్బంది మాత్రమే విధులకు హాజరుకానున్నారు. తాజా నిర్ణయంతో నేటి నుంచి ఈ నెల 20 వరకు కేవలం 4 గంటలు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నుంచి బ్యాంకులు, ఏటీఎం సేవలకు మినహాయింపు నిచ్చిన విషయం తెలిసిందే.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సూచనల మేరకు కుదించిన పనివేళల్లో నగదు డిపాజిట్, విత్‌డ్రాయిల్, చెక్కుల క్లియరెన్స్, రెమిటెన్సులు, ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనున్నట్లు స్టేట్‌లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కన్వీనర్ క్రిషన్ శర్మ చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకే ప్రజలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు వున్నందున, రోజంతా తెరిచినప్పటికీ ఉపయోగం లేదన్న కారణంగా బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి రామకృష్ణ తెలిపారు.