నిండుకుండల్లా జంట జ‌లాశ‌యాలు

 ఉస్మాన్‌సాగ‌ర్ 6 గేట్లు, హిమాయ‌త్‌సాగ‌ర్ 10 గేట్లు తెరిచి నీటి విడుద‌ల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా జంట జ‌లాశ‌యాలు నిండుకుండల్లా మారిపోయాయి. రెండు జ‌లాశ‌యాల‌కు భారీగా వ‌ర‌ద నీరు చేరుతుండ‌టంతో పూర్తిస్థాయి నీటి మ‌ట్టానికి చేరాయి. దీంతో మంగ‌ళ‌వారం(28.09.2021) సాయంత్రం 6 గంటల‌ నాటికి ఉస్మాన్ సాగ‌ర్ 6 గేట్లు, హిమాయ‌త్ సాగ‌ర్ 10 గేట్లు ఎత్తి దిగువ‌కు నీటిని వ‌దులుతున్నారు.

ఉస్మాన్ సాగ‌ర్‌..

నిన్న రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఉస్మాన్‌సాగ‌ర్ 4 గేట్ల‌ను 2 ఫీట్ల వ‌ర‌కు ఎత్తి నీటిని వ‌దులుతుండ‌గా, ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌కు 4 గేట్ల‌నూ 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల వ‌ర‌కు తెర‌వ‌డం జ‌రిగింది. అలాగే, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మ‌రో 2 గేట్ల‌ను 3 ఫీట్ల ఎత్తుకు తెరిచి, మొత్తం 6 గేట్ల నుంచి 2100 క్యూసెక్కుల వ‌ర‌ద‌ నీటిని మూసీలోకి వ‌దులుతున్నారు.

హిమాయ‌త్‌సాగ‌ర్‌..

నిన్న రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హిమాయ‌త్‌సాగ‌ర్‌ 2 గేట్ల‌ను ఒక ఫీటు ఎత్తి నీటిని వ‌దులుతుండ‌గా, ఇవాళ ఉద‌యం మ‌రో 6 గంట‌ల‌కు 2 గేట్లను ఎత్తడంతో పాటు మొత్తం 4 గేట్ల‌ను 2 ఫీట్ల ఎత్తుకు తెర‌వ‌డం జ‌రిగింది. ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌రో 2 గేట్లు, 11 గంట‌ల‌కు 2 గేట్లు, మ‌ధ్యాహ్నం 1 గంట‌కు 2 గేట్లు తెరిచి, మొత్తం 10 గేట్ల ద్వారా మూసీ న‌దిలోకి నీటిని వ‌ద‌ల‌డం జ‌రుగుతోంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తెరిచి ఉన్న 10 గేట్ల‌లో రెండు గేట్ల‌ను 2 ఫీట్ల నుంచి 3 ఫీట్ల ఎత్తుకు తెరిచి, మొత్తం 7700 క్యూసెక్కుల వ‌ర‌ద నీటిని దిగువ‌కు వ‌ద‌ల‌డం జ‌రుగుతోంది.

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ఎండీ దాన‌కిశోర్‌

జంట జ‌లాశ‌యాల నుంచి మూసీ న‌దిలోకి భారీగా వ‌ర‌ద నీటిని వ‌దులుతున్నందున జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్‌.. రెవెన్యూ, సంబంధిత‌ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. జంట జలాశయాల లోత‌ట్టు ప్రాంతాల్లో ఉన్న కాల‌నీలు, మురికివాడ ప్రాంతాలు మ‌రియు మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కోవ‌డాన‌నికి, అవ‌స‌ర‌మైన స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సన్న‌ద్ధం కావాల‌ని హైద‌రాబాద్ మ‌రియు రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.