Telangana LockDown అమల్లోకి..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ప్రారంభమైంది. లాక్డడౌన్ సడలింపులు ముగియడంతో ఇవాళ (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు మూత పడ్డాయి. సమయం 10 గంటలు దాటడంతో సమయం దగ్గరపడటంతో పలువురు ఇళ్లకు చేరుకునేందుకు ఉరుకులు.. పరుగులు తీశారు.
రాష్ట్రంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు రాజధాని నగరంలోని రద్దీ ప్రాంతాలు అమీర్పేట, పంజాగుట్టా, ఎస్ ఆర్ నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లోని వస్త్ర, వాణిజ్య దుకాణాలు వ్యాపారులు మూసివేశారు.

బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు వెలవెలబోయాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. పోలీసులు ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అత్యవసర వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని వెనక్కి పంపించేస్తున్నారు.

కాగా గత లాక్డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పని చేస్తాయని తెలంగాణ కేబినెట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి అని తెలిపింది. లాక్డౌన్ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియాకు మినహాయింపు ఇచ్చింది. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
