9మంది వైద్య విద్యార్థుల‌కు డ్ర‌గ్స్ పాజిటివ్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని మెడిక‌ల్ క‌ళాశాలలో విద్యార్థుల‌కు గంజాయి స‌ర‌ఫ‌రా  క‌ల‌క‌లం రేపింది. మెడిసిటి  క‌ళాశాలలోని 24 మంది విద్యార్థుల‌కు డ్ర‌గ్స్ టెస్ట్ చేయ‌గా.. 9 మంది విద్యార్థుల‌కు పాజిటివ్‌గా తేలింది. పోలీసులు కాలేజ్‌కి గంజాయి స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రిని అరెస్టు చేశారు. క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌కు చెందిన జ‌రీనా బాను , అర‌ఫాత్ అహ్మ‌ద్ ఖాన్ గంజాయిని న‌గ‌రానికి తీసుకొచ్చి స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు స‌మాచారం. డ్ర‌గ్స్ కొనుగోలు చేస్తున్న 82 మంది వినియోగ‌దారుల‌ను పోలీసులు గుర్తించారు. వారిలో 32 మంది మెడిసిటి మెడిక‌ల్ కాలేజి విద్యార్థులు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 24 మందికి టెస్ట్ లు నిర్వ‌హించారు. మొత్తం 9 మందికి పాజిటివ్‌గా తేలింది. డ్ర‌గ్స్ పాజిటివ్ వ‌చ్చిన వారిలో ఇద్ద‌రు అమ్మాయిలు కూడా ఉన్నారు. వీరంతా హాస్ట‌ల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు.

ఈగ‌ల్ పోలీసులు నిర్వ‌హించిన ఆప‌రేష‌న్‌లో న‌గ‌రానికి గంజాయిని తెచ్చి స‌రాఫ‌రా చేస్తున్న ఇద్ద‌రిని అరెస్టు చేశారు. వీరు గంజాయిని పెడ్ల‌ర్ల ద్వారా స‌ర‌ఫ‌రా చేయిస్తున్నారు. ఈ క్ర‌మంలో డ్ర‌గ్స్ కొనుగోలు చేసిన వారిని సైతం పోలీసులు గుర్తించారు. వారిలో మెడిక‌ల్‌ కాలేజ్ విద్యార్థులు ఉండ‌టం గ‌మ‌నార్హం.

డ్ర‌గ్స్ పాజిటివ్ వ‌చ్చిన 9 మంది విద్యార్థుల‌ను డి-అడిక్ష‌న్ సెంట‌ర్‌కు పంపించారు. మెడిసిటి కాలేజ్ యాజ‌మాన్యం విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భ‌విష్య‌త్తులో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా విద్యార్థులు మ‌త్తుకు బానిస‌లు కాకుండా చూసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఇందుకోసం విద్యాసంస్థ‌ల్లో ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌డ‌తామ‌ని ఈగ‌ల్ అధికారులు తెలిపారు.

Also Read: స్క్రాబ్ దుకాణంలో సిలిండ‌ర్ పేలి ముగ్గురు మృతి

 

Leave A Reply

Your email address will not be published.