TS: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై నిర్ణయం తీసుకోలేదు: మంత్రి సబిత
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇంటర్ పరీక్షలపై సర్కార్ నుంచి ఇంకా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇప్పటికే కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ సర్కార్ రెండో సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేయనుందనే ప్రచారం జరుగుతోంది.
సెకండ్ ఇయర్ పరీక్షల రద్దు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత పరీక్షలపై ప్రకటన చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మంత్రి సబిత వికారాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రద్దు చేశారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు మంత్రి వివరణ ఇచ్చారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల రద్దుపై సమీక్ష తర్వాతే ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.