TS: కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం : సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని తెలంగాణ సిఎం కె. చంద్రశేఖరరావు అన్నారు. కరోనా పరిస్థతి, లాక్‌డౌన్ అమలు సంబంధిత అంశాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓవైపు ఇంటింటి జ్వరసర్వేను కొనసాగిస్తూనే మరోవైపు నిర్ధరణ పరీక్షలు పెంచుతూ కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం అమలు చేయాలని అధికారులను ముఖ్యమత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. నిబంధనల పేరిట ఎవరికీ కరోనా పరీక్షలు నిరాకరించవద్దని స్పష్టం చేశారు. రేపట్నుంచే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ల సంఖ్యను పెంచాలని తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం పడకలు పెంచాలని, అవసరమైన ఔషధాలు సమకూర్చుకోవాలని కేసీఆర్ తెలిపారు. రెండో డోసు అవసరమైన వారి కోసం తగిన టీకాలు సమకూర్చుకోవాలని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం..
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుందన్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, వారి ఆరోగ్య రక్షణలో భాగంగా లాక్‌డౌన్ కఠినంగానే అమలువుతున్నదన్నారు. ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో వైద్య కేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు, వైద్యాధికారులకు ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దని సీఎం మరోసారి స్పష్టం చేశారు.
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి..
అన్ని పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చాలని, రాష్ట్రంలో ఆక్సిజన్ ఉత్పత్తిని 600 ఎంటీలకు పెంచే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. అదే సందర్భంలో సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వారు అధిక సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాక్స్ ఫోర్సు చైర్మన్ మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ ఒకవేళ వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు.
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం గాంధీలో 150 బెడ్లు, ఈ.ఎన్.టి. ఆస్పత్రిలో 250 బెడ్లను, మొత్తం 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం సరోజినీదేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు.
సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం సెక్రటరీ, సీఎంవో కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీసు కమిషనర్లు అంజనికుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, అడిషినల్ డీజీ జితేందర్, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.