వైసీపీ సర్కార్‌కు వారం గడువు ఇస్తున్నాం: పవన్ కల్యాణ్
విశాఖపట్టణం (CLiC2NEWS): `విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు` నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి జనసేన మద్దతు ప్రకటించింది. మద్దతులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జనసే అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మొదట శ్రీ శ్రీ రాసిన నేను సైతం కవితను చదివి వినిపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వారంలోగా అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పవన్ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ సర్కార్ వారంలోగా స్పందించాలని జవన్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వానికి వారం గడువు ఇస్తున్నామని పవన్ పేర్కొన్నారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం.. అండగా నిలబడుతాం అంటూ వైసీపీ చెప్పే మాటల్ని నమ్మం అని పవన్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వైకాపా నేతలు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలి.. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం అని పవన్ స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు చెప్పింది చాలు.. చాలా విన్నాం…! ఇంకా మా చెవుల్లో క్యాబేజీలు పెట్టకండి అంటూ పవన్ పంచ్‌లు విసిరారు. అన్ని పరిశ్రమలు, సంస్థలకు నష్టాలు, అప్పులు ఉన్నాయి.. ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమకు తప్ప అని జనసేనాని అన్నారు. సొంత గనులు కేటాయిస్తే విశాఖ స్టీల్‌కు నష్టాలు తగ్గుతాయని అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడగరని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరించొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి విజ్ఞప్తి చేశామని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నేతలు నాదేండ్ల మనోహర్, హరిప్రసాద్, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు పాల్గొన్నారు.
