సిద్దిపేటలో `మోడల్ బస్టాండ్`కు శంకుస్థాపన చేసిన హరీష్రావు
సిద్ధిపేట : సిద్దిపేట పట్టణంలో కొత్త మోడల్ బస్టాండ్ నిర్మించబోతున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో రూ.6 కోట్ల రూపాయల వ్యయంతో బస్ స్టేషన్ పునర్నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎక్స్ ప్రెస్ బస్టాండు రోడ్డు పునరుద్ధరణ- రోడ్డు విస్తరణ పనులకు కూడా జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డిలతో కలిసి మంత్రి శ్రీ హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ హరీశ్ రావు మాట్లాడుతూ.. 45 సంవత్సరాల క్రితం అప్పటి రవాణా శాఖ మంత్రి చొక్కరావు పాత బస్ స్టేషన్ ను ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సిద్దిపేట జనాభా 10 రెట్లు పెరిగిందన్నారు. పెరిగిన జనాభాకు తగ్గట్టు బస్టాండ్లో సౌకర్యాలు లేవు అని తెలిపారు. ప్రతిరోజూ సుమారు 22 నుంచి 25 వేల మంది ప్రయాణీకులు, పరిసర ప్రాంతాలలో ప్రజలు ఈ బస్ స్టేషన్ కు వచ్చి వెళ్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని రూ.6 కోట్లతో నూతన బస్ స్టేషన్కు ఇవాళ శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు.
గతంలో సీఎం కేసీఆర్ సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలో ఎక్స్ ప్రెస్ బస్టాండ్ నిర్మించారని గుర్తు చేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు దాదాపు దశాబ్దాలుగా పట్టణ రద్దీ పెరిగింది. దీంతో ఎక్స్ ప్రెస్ బస్టాండ్ వెనుక ఉన్న కాలనీలకు ట్రాఫిక్ పెరిగిన దృష్ట్యా రూ.12 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ-వైడింగ్ పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఏం రాజశేఖర్, ఆర్టీసీ ఛీప్ అడ్వైజరు రాంబాబు, డీఏం రాంమోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.