రేప‌టి నుంచి ప‌త్తి కొనుగోళ్లు : మ‌ంత్రి ఎర్ర‌బెల్లి

వ‌రంగ‌ల్ : రేపటి(గురువారం) నుంచి పత్తి, నవంబర్ 1 నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కావునా రైతులు మార్కెట్ యార్డులకు ఈ తేదీల ప్రకారం పత్తిని, ధాన్యాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్న‌ట్లు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు సూచించారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో పంటల కొనుగోళ్లు, వరి, పత్తి సేకరణపై మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ లు బుధ‌వారం వరంగల్ హరిత కాకతీయ హోటల్‌లో జిల్లాస్థాయి కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… గ‌తేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు తీసుకొచ్చిన ధాన్యము అమ్మడానికి ఎదురు చూడకుండా వెంటనే కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ధాన్యము చివరి వరకు కొనుగోలు చేయాలని అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా మ‌క్క‌ల‌ను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు.
ఎన్ని రోజులైనా పండించిన పంటను కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని తొందరపడి తేమతో ఉన్న పత్తిని, తాలుతో ఉన్న ధాన్యాన్ని తీసుకురావద్దని మంత్రి రైతుల‌ను కోరారు. ఈసారి ధాన్యం కొనుగోలుపై సమీక్ష చేసి కొనుగోలు కేంద్రాలను, రవాణా వాహనాలను, అధికారులను, గోదాములను పెంచడం జరిగిందని, రైతుకు మేలు చేసే విధంగా కొనుగోలు ఉంటుందని హామీ ఇచ్చారు. ధాన్యం, పత్తి కొనుగోలులో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే వారిపై క‌ఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు. రేపటి నుండే పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తున్న‌ట్లు ఇందుకు సంబంధించి సీసీఎస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలు ఎక్కువగా వేసే సంప్రదాయం ఉంది. ఈసారి కూడా వాటిని బాగానే వేశారు. యాసంగిలో కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ రైతు నష్టపోకూడదని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించడం జరిగింద‌న్నారు. ఈ వానాకాలం పంటను కూడా అదే విధంగా సేకరించ‌నున్న‌ట్లు తెలిపారు. కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, మార్కెట్ కమిటీ అధికారులు, సీసీఐ అధికారులు అందరూ సమన్వయంతో రైతులకు మేలు జరిగే విధంగా పంటల కొనుగోలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

situs slot

Leave A Reply

Your email address will not be published.