లాక్‌డౌన్ కు సిద్ధం కండి: ఉద్ధవ్ ఠాక్రే
మార్గదర్శకాలపై అధికారులకు సిఎం ఆదేశాలు
ముంబయి: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా కేసులు ఇక్కడే వెలుగు చూస్తున్నాయి. కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం సంకేతాలిచ్చారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రజలు మరో లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్ అమలు చేసేందుకు సిద్ధం కావాలని.. అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. దవాఖానాల్లో సౌకర్యాలపై ఆరాతీశారు. దేశంలో రోజూ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 60 శాతానికి పైగా మహారాష్ట్ర నుంచే ఉంటున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్రలో 312 మంది కరోనా రోగులు మరణించారు. ఒక్కరోజులో ఇంతమంది ప్రాణాలుకోల్పోవడం ఈ ఏడాదిలోనే తొలిసారి. ఇదే సమయంలో 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 62,714 కొత్త కేసులు నమోదయ్యాయి.