10 మెగా ప్రాజెక్టులతో 55 వేల మందికి ఉపాధి: సీఎం జగన్
విజయవాడ (CLiC2NEWS): ఎగుమతుల విషయంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తోన్న వాణిజ్య ఉత్సవ్ 2021 ని ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో ప్రారంభించారు. అనంతరం పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాన్ని సిఎం తిలకించారు. స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్ ఉత్పత్తులకు సంబంధించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏపీ ఎగుమతుల రోడ్ మ్యాప్ బ్రోచర్‌ను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు.ఎగుమతులకు సంబధించి ప్రత్యేకంగా ఈ- పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల ప్రముఖులు, రాయబారులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పారిశ్రామకవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. గత రెండేళ్లలో అనేక సవాళ్లు ఎదురైనా పారిశ్రామికంగా రాష్ట్రం గణనీయ వృద్ధి సాధించిందన్నారు. 2021 ఎగుమతుల్లో 19.4 శాతం మేర వృద్ధి నమోదైందని.. 68 మెగా పరిశ్రమలతో రూ. 30,175 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 62 మెగా ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని.. 3 పారిశ్రామిక కారిడర్లను అభివృద్ధి చేస్తున్న ఏకైక రాష్ట్రం ఎపి అని తెలిపారు. రాష్ట్రానికి సహకరించాలని పరిశ్రమవర్గాలను ముఖ్యమంత్రి కోరారు.