Mandapeta: దేవినేని ఉమపై దాడి అమానుషం: ఎమ్మెల్యే వేగుళ్ళ
మండపేట (CLiC2NEWS): తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్సీపీ సర్కార్ దాడి చేయించడం హేయమైన చర్య అని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఉమపై కక్ష పూరితంగా వ్యవహరించి కేసులు బనాయించడం చాలా దారుణం అన్నారు. ఆయనపై హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.
వైకాపా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అవినీతిని ప్రశ్నించే టీడీపీ నాయకులపై ఇటువంటి తప్పుడు కేసులు మోపడం ఈ ప్రభుత్వానికి కొత్తేమి కాదని అన్నారు. అరెస్టులతో వైసీపీ చేసిన తప్పులు దాగవు అని అన్నారు. వైసీపీ కార్యకర్తలు చేస్తున్న దారుణాలు ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే మీకు, మీ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని అన్నారు. వైసీపీ దుర్మార్గపు చర్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు.