mandapeta: పన్నుల పెంపుతో ప్ర‌జ‌ల‌పై పెను భారం..

వ్యతిరేకిస్తూ టిడిపి సభ్యులు వాకౌట్..

మండపేట (CLiC2NEWS): ఎపి స‌ర్కార్ కొత్తగా ప్ర‌వేశ‌పెట్టిన ఇంటి పన్నుల పెంపుతో ప్రజలపై పెనుభారం పడుతుందని స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. శ‌నివారం మండ‌పేట చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగింది. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు హాజరై ఇంటి పన్నులు పెంచాలని కౌన్సిల్ లో తీర్మానం చేసేందుకు తెచ్చిన అంశాలపై ఆయన వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనికి కౌన్సిల్ విపక్ష సభ్యులు కూడా ఎమ్మెల్యే కు మద్దతు తెలిపి ఇంటి పన్ను పెంపుకు తాము ఎంతమాత్రం ఒప్పుకోమని నిరసన తెలియజేశారు.ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నులు పెంచాలన్న ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసలే కరోనాతో ప్రజలంతా పనుల్లేక, వ్యాపారాలు లేక, కుటుంబాలు గడవక దయనీయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తుంటే పన్నుల వడ్డన అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని ఎమ్మెల్యే తన ఆవేదన వ్యక్త పరిచారు. ఇందుకు చైర్ పర్సన్ రాణి మాట్లాడుతూ పన్నులు పెంచాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానిది అన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు నిధులు లేమితో కొట్టిమిట్టాడు తున్నాయని మున్సిపాలిటీలకు ఆదాయం పెంచాలనే ఆలోచనే తప్ప మరే ఉద్దేశం లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మండపేట మున్సిపాలిటీకి జనాభా ప్రాతిపదికన పనిభారంతో పాటు ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. కేంద్రం చెప్పిన దానికంటే అతి తక్కువ శాతం పన్ను పెంచుతున్నమని ఎమ్మెల్యే కు సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో ప్రజల నుండి ఎలాంటి అభ్యంతరం లేకున్నప్పటికీ కావాలనే టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో కంటే తమ ప్రభుత్వ పాలనలోనే ప్రజలకు సత్వర పనులు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకోవాలని సమాధానం ఇచ్చారు. మున్సిపాలిటీకి ఆదాయ వనరులు పెరిగితే పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం వుంటుందని అన్నారు. కేంద్రం 0.50 పెంచమని ఆదేశాలు ఇస్తే ప్రజలకు భారం మోపకూడదు అన్న దూర ఆలోచనతో 0.15 శాతం మాత్రమే పెంచుతున్నామని స్పష్టం చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఎంత మాత్రం కుదరదు అంటూ వాకౌట్ చేస్తూ సభ్యులతో కలిసి సమావేశం నుండి నిష్క్రమించారు. సభాధ్యక్షురాలిగా తన మాటను వినకుండా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడం ఎంత సబబు కాదని అన్నారు. తాను వార్డు పర్యటనలు చేసినప్పుడు ప్రజలంతా సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. వార్డు సమీక్షల్లో ప్రజల మద్దతు తమకు పుష్కలంగా ఉందని కేంద్రం జారీ చేసిన ఆదేశాలను గౌరవించాల్సిన అవసరం ఉందని అందుచేత 0.15 శాతం పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాంకుమార్, ఆర్ ఐ వంక ప్రభాకర్ చౌదరి, టీపీఎస్ కట్టావీరబ్రహ్మం, మున్సిపల్ మేనేజర్ నిర్మలాకుమారి, ఏఈ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ళ నారయ్యబాబు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.