లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ

మండపేట(CLiC2NEWS): కరోనా విజృంభిస్తున్న వేళ వైరస్ బారిన పడకుండా ప్రజలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వాదా ప్రసాదరావు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయుర్వేదంలో ప్రసిద్ధి గాంచిన నెల్లూరు ఆనందయ్య మందును పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ సభ్యులు, ఏడిద కొత్తూరులో ఉన్న శ్రీ మిత్ర పేపర్ ప్రొడక్ట్ అధినేత చుండ్రు రాంబాబు సౌజన్యంతో నెల్లూరు నుండి రప్పించి ఆనందయ్య మందును సమకూర్చారు.

సత్యశ్రీ రోడ్డులో ఉన్న లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాలులో ఈ మందును అధ్యక్షుడు వాదా ప్రసాదరావు చేతుల మీదుగా పట్టణం, పరిసర ప్రాంత ప్రజలకు పంచి పెట్టారు. వెయ్యి మందికి ఆనందయ్య మందు పంచామని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ భారతీయ ఆయుర్వేదానికి ఎంతో విశిష్టత ఉందన్నారు.

ఆయుర్వేదం ద్వారా ఎన్నో రకాల జబ్బులకు ఉపశమనం కలిగింది అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ విరుగుడుకు మన రాష్ట్రానికి చెందిన బొణిగే ఆనందయ్య ఆయుర్వేదం మందు కనిపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారని అన్నారు. ఆనందయ్య మందుకు డిమాండ్ పెరిగి దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందడం చాలా గర్వకారణం అన్నారు. ఈ మందు మూడవ దశ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దివ్యౌషధంగా పని చేస్తుంది అన్నారు.

లయన్స్ క్లబ్ ద్వారా పంపిణీ చేసిన ఆనందయ్య మందును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు నాగేంద్ర బాబు, చెన్నా రాంబాబు, కర్రి నారాయణరెడ్డి, చక్కా రాంబాబు, చిరుకూరి బాపిరాజు, కురసాల వీరవెంకట సత్యనారాయణ, గనిశెట్టి శ్రీనివాసరావు, ఉప్పలపాటి పాపరాజు, మండవిల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.