చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం.. సజ్జనార్‌కు కృతజ్ఞతలు
మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నుంచి కోటపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న సమస్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఈ మధ్యనే ఓ ఉపాధ్యాయురాలు ట్వీట్ చేయగా.. ఆయన తక్షణమే స్పందించి బస్సు సౌకర్యం కల్పించారు.
వివరాల్లోకి వెళ్తే.. కోటపల్లిలోని స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల రవాణా సౌకర్యం పై కస్తూర్భా పాఠశాల టీచర్ భారతి చేసిన ట్విట్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్‌కు దాదాపు 200 మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. విద్యార్థులు కోటపల్లి మోడల్ స్కూల్ కి రావడానికి సరైనన్ని రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై టీచర్ భారతి విద్యార్థుల సమస్యలను వీడియో తీసి ఆర్టీసీ ఎండీకి ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సజ్జనార్ ప్రతిరోజు ఉదయం చెన్నూరు నుండి కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం అదనపు బస్ ప్రారంభానికి తగిన చర్యలు తీసుకున్నారు. సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై టీచర్ భారతి, కోటపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.