కాన్పు సమయంలో కడుపులో దూది.. భరించలేని నొప్పితో మహిళ మృతి
యాదాద్రి భువనగిరి (CLiC2NEWS): వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలను బలిగొన్నది. వివరాల్లోకి వెళ్తే.. ఏడాది క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఓ గర్భిణి కాన్పు నిమిత్తం భువనగిరి కేకే ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో ఆమెకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించి డెలివరీ చేశారు. ప్రసవం తర్వాత ఆ మహిళ కడుపునొప్పితో బాధపడింది. క్రమక్రమంగా ఆమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఇటీవలే చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు అన్ని రకాల మెడికల్ టెస్టులు వైద్యులు నిర్వహించారు. ఆ టెస్టుల్లో కడుపులో దూది ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
డెలివెరి సమయంలో ఆమె కడుపులో దూది అలానే ఉంచి, మరిచిపోయి వైద్యులు కుట్లు వేశారు. దాంతో ఆ మహిళ పేగులు దెబ్బతిని తీవ్రమైన కడుపునొప్పికి కారణమైందని వైద్యులు పేర్కొన్నారు. కాగా బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఆమెకు తొలి కాన్పు చేసిన భువనగిరి కేకే ఆస్పత్రి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.